నిజమైన పద్మవ్యూహంలో విశాల్

Update: 2018-03-16 12:13 GMT
తన కొత్త సినిమాకు తెలుగులో అభిమన్యుడు అనే పేరు పెట్టుకున్న విశాల్ తమిళనాట నిజంగానే పెద్ద పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. ఇవాళ్టి నుంచి కోలీవుడ్ లో సమస్తం బంద్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్ల తో పాటు కొత్త సినిమాల విడుదలలు - షూటింగులు మొత్తం ఆపేసి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు - ప్రభుత్వం తో డైరెక్ట్ ఫైట్ కు దిగిన విశాల్ ముందు ఇప్పుడు పెను సవాళ్లు ఉన్నాయి. డిమాండ్ల సాధన కోసం ఇదంతా విశాల్ చేస్తున్నప్పటికి ఒకవేళ అవి నెరవేరకుండానే వెనక్కు తగ్గాల్సి వస్తే పెద్ద మచ్చే పడుతుంది. తనకు మద్దతుగా అధిక శాతం ఉన్నప్పటికీ వైరి వర్గం తక్కువేమీ లేదు. ఈ ఇష్యూ లో విశాల్ ఓడిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు ఈ విషయంలో మౌనం వహించడం దీనికి నిదర్శనం . టాలీవుడ్-కోలీవుడ్ కలిసే సమ్మె నిర్ణయం తీసుకున్నప్పటికీ మన దగ్గర ఇది త్వరగా వీగిపోయి వారం రోజులకే థియేటర్లు తెరుచుకున్నాయి.

కాని తమిళనాడులో పరిస్థితి అలా లేదు. అంతకంతకు తీవ్రం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు మొదలుకొని నిర్మాతల దాకా అందరు ఆందోళనలో ఉన్నారు. విశాల్ అంటే గిట్టని బ్యాచ్ సమస్యల పరిష్కారంలో ఇంత దూకుడు పనికిరాదని ప్రచారం కూడా మొదలు పెట్టింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అంత ఈజీగా డిమాండ్లకు తల ఒగ్గేలా కనిపించడం లేదు. పైగా సమ్మె విరమింపచేసే దిశగా ప్రభుత్వం వైపు నుండి కూడా ఎటువంటి సంకేతాలు లేవు. ఈ నేపధ్యంలో సమస్య ఇంకా క్లిష్టంగా మారింది. సెన్సార్ కోసం ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న నిర్మాతలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వారు సహజంగానే విశాల్ మీద గుర్రుగానే ఉన్నారు. ఒక పక్క నడిగర్ సంఘం, మరోపక్క నిర్మాతల సమాఖ్య బాధ్యతలు ఇవి కాకుండా తను నటించిన సినిమాల వ్యవహారాలు మొత్తంగా విశాల్ పెద్ద ఊబిలోనే ఉన్నాడు.

దీన్నుంచి ఎలా బయటపడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. గెలిచాడా విశాల్ మరో మెట్లు పైకెక్కుతాడు. తేడా వచ్చిందా పాతిక మెట్లు కిందకు లాగడానికి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారు. సో సమ్మె డిమాండ్లకు పరిష్కారం సాదిస్తేనే విశాల్ కు విమర్శలను తట్టుకునే శక్తి వస్తుంది. లేదా విమర్శల బాణాలు మామూలుగా దూసుకురావు. తన స్వంత సినిమా ఇరుమ్బుతిరై(అభిమన్యుడు)విడుదల వాయిదా వేసుకున్న విశాల్ ఇది కనక జరగకపోయి ఉంటే రామ్ చరణ్ రంగస్థలంతో నేరుగా పోటీకి దిగేవాడు. ఇప్పుడు ఈ సవాళ్ళ పద్మవ్యూహం నుంచి విశాల్ ఎలా బయటికి వస్తాడా అనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News