రాజమౌళి తండ్రి ఏం చెప్పాడులే..

Update: 2017-11-24 04:37 GMT
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు రచయితగా ఉన్న గుర్తింపు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సినిమాల్లో ఒకట్రెండు మినహా అన్నింటికీ ఆయనే కథకుడు. ఈ సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. జక్కన్న దర్శకుడు కావడానికంటే ముందు ఆయన ‘బొబ్బిలి సింహం’.. ‘సమరసింహారెడ్డి’ లాంటి సినిమాలకు పని చేశారు. ఐతే ఆయన రచయితగా ఎక్కువ పేరు సంపాదించింది గత కొన్నేళ్లలోనే. ఓవైపు ‘బాహుబలి’.. మరోవైపు ‘భజరంగి భాయిజాన్’ లాంటి సినిమాలకు కథ అందించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. కథల గురించి.. రచన గురించి.. ఆయన చెప్పే విషయాల్ని దేశంలోని అన్ని సినీ పరిశ్రమల వాళ్లూ చాలా ఆసక్తిగా వింటారు.

మంచి మాటకారి కూడా అయిన విజయేంద్ర.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా కథ ఎలా ఉండాలనే విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయన చెప్పిన పోలికలు ఆశ్చర్యపరిచేవే. సాధారణంగా ఒక భార్య తన భర్త ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతుందని.. స్వీట్లు ఎక్కువ తింటే షుగర్.. కొలెస్ట్రాల్ పెరుగుతాయని అవి ఇవ్వదని.. కానీ ఒక వేశ్య మాత్రం తన దగ్గరికి వచ్చే వ్యక్తి ఏమైనా పర్వాలేదని.. తనకు డబ్బు చేతికి రావడమే ముఖ్యం అనుకుంటుందని... ఒక కథ రాసేటపుడు ఈ రెండు విషయాల్నీ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఒక భార్య తరహాలో కథలో నిజాయితీ ఉండాలని.. అదే సమయంలో వేశ్య లాగా ఎలాగైనా సరే డబ్బులు రాబట్టే లక్షణాలు ఆ కథలో ఉండాలని.. ఇలా ఉన్న కథే ‘హోల్ సం ఎంటర్టైన్మెంట్’ ఇస్తుందని ఆయన తనదైన శైలిలో సూత్రీకరించారు.
Tags:    

Similar News