దుమ్మురేపేస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్

Update: 2021-01-01 08:07 GMT
తెలుగు .. తమిళ భాషల్లో విలన్ కావాలంటే, వెంటనే బాలీవుడ్ పై దృష్టిపెడుతున్నారు. కాస్త ఖర్చు ఎక్కువైనా సాధ్యమైనంతవరకూ అక్కడి నుంచే విలన్స్ ను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే లేడీ విలన్ అవసరమైతే మాత్రం, అందరూ పరిశిలించే మొదటిపేరు వరలక్ష్మీ శరత్ కుమార్ అనే చెప్పుకోవాలి. అవును ఇప్పుడు లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ పెట్టింది పేరు. ముందుగా హీరోయిన్ గా తన కెరియర్ ను ప్రారంభించినప్పటికీ, స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. అలా అని చెప్పేసి ఆమె దిగాలుపడిపోయి కూర్చోలేదు. తాను ఏ తరహా పాత్రలకు పనికొస్తానననేది బాగా ఆలోచించుకుని మరీ రంగంలోకి దిగింది.

తెలుగు .. తమిళ భాషల్లో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను పోషించే లేడీ ఆర్టిస్టులు లేరు. ఇక లేడీ విలన్ గా కథను పండించేవారు అసలే లేరు. అందువలన ఆ తరహా పాత్రలపై ఆమె దృష్టి పెట్టింది. తమిళంలో ఆమె స్టార్ హీరోల సినిమాల్లోనే నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో మెప్పించింది. అలా ఆమె పోషించిన సినిమాలు .. పాత్రలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అలా తెలుగులో ఆమె చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమా కూడా ఆమెకి గుర్తింపు తెచ్చిపెట్టింది.

తాజాగా ఆమె రవితేజ హీరోగా రూపొందిన 'క్రాక్' సినిమాలోను లేడీ విలన్ పాత్రలో నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాస్త రొమాన్స్ .. మరికాస్త యాక్షన్ అన్నట్టుగా ఈ ట్రైలర్ కొనసాగింది. ఈ ట్రైలర్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ అలా మెరిసి ఇలా మాయమైనా ఆమె మాస్ లుక్ .. క్యారెక్టరైజేషన్ .. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయనేది అర్థమైపోతోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపిస్తున్న ఈ సినిమాలో, లేడీ విలన్ గా ఆమె దుమ్మురేపేయడం ఖాయంగానే కనిపిస్తోంది. నిండుగా .. నిబ్బరంగా .. నిర్భయంగా కనిపిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ లుక్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అనిపిస్తోంది.      
Tags:    

Similar News