త్రివిక్రమ్.. ఏం చేస్తాడు?

Update: 2016-08-31 11:30 GMT
‘సర్దార్ గబ్బర్ సింగ్’ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అన్న మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. తనతో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడూ ముందుకు రావడం లేదని.. అందుకే తనే స్క్రిప్టు రాసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు పవన్. ఇది చాలామందికి సిల్లీగా అనిపించింది. పవన్ లాంటి హీరోతో సినిమా చేయడానికి డైరెక్టర్లు ముందుకు రాకపోవడం ఏంటి అనుకున్నారు వాళ్లంతా. కానీ పవన్ అలా అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నిజానికి పవన్ తో సినిమా చేయాలని చాలామంది దర్శకులకు ఉంటుంది. కానీ తనతో సినిమా అంటే ఒక పట్టాన తేలే వ్యవహారంకాదు. అందులోనూ గత కొన్నేళ్లలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. అందుకే పవన్ సినిమా అంటే పెద్ద డైరెక్టర్లు ఎవరైనా వెనకడుగే వేస్తారు.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో పవన్ వాయిదాల పర్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్క్రిప్టు రెడీగా ఉన్నా.. షూటింగ్ విషయంలో చాలా కాలయాపన చేశాడు పవన్. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. పవన్ ఎప్పుడొస్తాడో తెలియదు.. ఇలాంటి డైలమా వల్ల సినిమా ఆలస్యమైంది. చివరికి రెండు నెలల్లో హడావుడిగా పగలూ రాత్రి షూటింగ్ చేశారు. ఆ ప్రభావం సినిమా మీద పడింది. ఇప్పుడు తన తర్వాతి సినిమా విషయంలోనూ అలాగే చేస్తున్నాడు పవన్. ఈ సినిమా ప్రారంభోత్సవం మాత్రమే జరుపుకుంది. అక్కడి నుంచి అడుగులు ముందుకు పడలేదు. దీంతో ఇప్పడు డాలీ కూడా కొంత అయోమయ స్థితిలో ఉన్నాడు.

పవన్ తో వ్యవహారం ఇలా ఉంటోంది కాబట్టే పెద్ద దర్శకులు తనతో సినిమా చేసే విషయంలో కాస్త ముందు వెనుక ఆలోచించే పరిస్థితి తలెత్తుతోంది. ఇంతకుముందు ఇంకో రెండో మూడో సినిమాలు మాత్రమే చేస్తానన్నాడు పవన్. ఈ మధ్య తిరుపతి మీటింగ్‌ లో సినిమాల్లో కంటిన్యూ అవుతానన్నాడు. ఐతే ఏ విషయం క్లారిటీ లేదు. 2019 ఎన్నికల నాటికి ఓ స్పష్టతా రావచ్చేమో. ఐతే ఆ ఎన్నికల్లో బరిలోకి దిగేముందు పవన్ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చకచకా పూర్తి చేస్తే చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. కానీ పవన్ ఆ దిశగా అడుగులు వేయట్లేదు. డాలీ సినిమా సంగతేంటో ఇంకా తేలలేదు. మరోవైపు త్రివిక్రమ్ పవన్ తర్వాతి సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. ఏడాది ఆఖర్లో పవన్ తో సినిమా మొదలుపెడదామని చూస్తున్నాడు. ఐతే డాలీ సినిమా పూర్తయ్యాకే పవన్ ఆ సినిమా చేయాల్సి ఉంది. మరి త్రివిక్రమ్ కూడా మిగతా దర్శకుల్లాగే పవన్ కోసం వెయిటింగులో ఉంటాడా.. దీన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టి ఇంకో సినిమా వైపు చూస్తాడా అన్నది ఆసక్తికరం.
Tags:    

Similar News