తితిలీ: టాలీవుడ్ సాయంలో ట్విస్ట్!

Update: 2018-10-21 06:34 GMT
విప‌త్తుల వేళ టాలీవుడ్ పెద్ద‌న్న‌లా ఆదుకుంటోంది. హుద్ హుద్ భీభ‌త్సం - చెన్న‌య్‌ - కేర‌ళ వ‌ర‌ద‌ల వేళ తెలుగు సినీహీరోలు ల‌క్ష‌ల్లో విరాళాలు ప్ర‌క‌టించి సీఎం రిలీఫ్ ఫండ్‌ కి త‌ర‌లించారు. కోట్లాది రూపాయ‌లు టాలీవుడ్ నుంచి సాయంగా అందింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల నుంచే కోటి పైగా విరాళాలు వెల్లువెత్తిన సంద‌ర్భాలున్నాయి. అయితే అలా చేరిన ఫండ్ నేరుగా బాధితుల‌కు అందుతుందా? అంటే అంద‌లేద‌నే సందేహం మ‌న టాలీవుడ్ స్టార్ల‌కు క‌లిగిందిట‌. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ! అన్న చందంగా వాస్త‌వంగా బాధితులు ఎవ‌రో వారికి నేరుగా ఆర్థిక‌ సాయం అందడం లేద‌న్న వాద‌నా టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది.

దీంతో సాయం చేయాల‌నుకున్న‌ హీరోలు యూట‌ర్న్ తీసుకున్నార‌న్న మాటా వినిపిస్తోంది. సిక్కోలు తితిలీ తుఫాన్ బాధితుల విష‌యంలో నేరుగా సాయం అందాల‌న్న ప‌ద్ధ‌తిని అమ‌లు చేసేస్తున్నార‌ట‌. ముఖ్యంగా ఈ విష‌యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాను ఏం సాయం చేయ‌ద‌లిచారో దానిని నేరుగా బాధితుల‌కే అందేలా చేయాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ట‌. బ‌న్ని ఇప్ప‌టికే 25ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిని నేరుగా బాధితులు ఎవ‌రున్నారో వారికి అభిమాన సంఘాల ద్వారా చేర‌వేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు. కేవ‌లం బ‌న్ని మాత్ర‌మే కాదు - ఇత‌ర టాలీవుడ్ హీరోలు ఇలానే బాధితుల‌కు నేరుగా త‌క్ష‌ణ‌ సాయం చేయ‌నున్నార‌ని ఫిలింన‌గ‌ర్‌ లో చ‌ర్చ సాగుతోంది.

సినిమా వాళ్ల‌కు ఉత్త‌రాంధ్ర నుంచి కోట్లాది రూపాయ‌లు క‌లెక్ష‌న్స్ ద‌క్కుతుంటాయి. అందుకే ఆ ప్రాంతం అంటే ప్ర‌త్యేక అభిమానం ఉంటుంది. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు నేరుగానే ఆదుకోవాల‌న్న ఆలోచ‌న టాలీవుడ్ హీరోల‌కు క‌ల‌గ‌డానికి కార‌ణ‌మిదేన‌ని అంటున్నారు. ఇక హీరో నిఖిల్ సైతం నేరుగా శ్రీ‌కాకుళం వెళ్లి అక్క‌డ మూడు రోజులు ప‌ర్య‌టించి వాస్త‌వంగా ఏం అవ‌స‌రమో ఆ సాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కార్య‌క‌ర్త‌ల ద్వారా సిక్కోలుకు ఏం అవ‌స‌ర‌మో ఆ మేర‌కు సాయం చేసే ప‌నిలోనే బిజీగా ఉన్నార‌ట‌. రిలీఫ్ ఫండ్‌ లు - స్కీముల్ని న‌మ్మ‌కుండా ఇలా నేరుగా బాధితుల్ని వెతుక్కుని వెళ్లి సాయం అందించ‌డం అన్న‌ది ప్రోత్సాహ‌క‌ర‌మే అంటూ ఓ వ‌ర్గం విశ్లేషిస్తోంది. అయితే అలా చేయాల‌నుకుంటే ప‌క‌డ్భందీ వ్యూహంతో స‌రైన బాధితులకు సాయం అందించాల్సి ఉంటుంది. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అంటే అధికారులు కుక్క‌లు మొరిగిన ఆర్నెళ్ల‌కు కానీ రారు. వ‌చ్చాక .. ఇదీ అదీ.. ప్రూఫ్‌ లు అంటూ సాయాన్ని తీవ్ర‌త‌ను బట్టి కాకుండా అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ చుట్ట‌రికాన్ని బ‌ట్టి చేస్తార‌న్న వాద‌నా వినిపిస్తోంది.

Tags:    

Similar News