ఎఫ్ క్లబ్ నవదీప్ ది కాదా? దాన్ని ఎందుకు మూసేశారు?

Update: 2021-09-14 03:24 GMT
అనూహ్యంగా తెర మీదకు వచ్చిన డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి సినీ నటుడు నవదీప్ తాజాగా ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు తొమ్మిది గంటల పాటు అతడికి విచారణ సందర్భంగా చుక్కలు కనిపించాయని చెబుతున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్ సోమవారం ఉదయం 11.15 గంటలకు ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. రాత్రి 8.45 గంటలకు ఆయన్ను విచారణ పూర్తి చేసి.. ఇంటికి పంపారు. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ తర్వాత ఎక్కువసేపు విచారణ జరిపింది నవదీప్ నే కావటం గమనార్హం.

తాజా విచారణలో డ్రగ్స్ అమ్మకందారుగా గుర్తించిన కెల్విన్ తో అతనికున్న సంబంధాలు.. అతనిదిగా చెప్పే ఎఫ్ క్లబ్ లావాదేవీలు.. మనీ ల్యాండరింగ్ కేంద్రంగా ఉన్న ఆరోపణలపైనా ప్రశ్నలు వేసినట్లుగా చెబుతున్నారు. ఈడీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.అన్నింటికి మించిన తన సొంతంగా పేర్కొనే ఎఫ్ క్లబ్ తనది కాదని.. తన స్నేహితులదని నవదీప్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ క్లబ్ లోనే భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లుగా తెలంగాణ ఎక్సైజ్  అధికారుల ఆరోపణగా ఉండేది. దీనికి సంబంధించిన విచారణ గతంలో జరిగింది. దాని వివరాలు బయటకు పూర్తిగా రాలేదు.

ఎఫ్ క్లబ్ ను నవదీప్ నిర్వహించగా.. అర్పిత్ సింగ్ జనరల్ మేనేజర్ గా వ్యవహరించినట్లు చెబుతుంటారు. అప్పట్లో దాదాపు 35 పెద్ద పార్టీలకు ఈ క్లబ్ వేదిక అయిన విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఎఫ్ క్లబ్ తనది కాదని.. తాను సినిమాకు సంబంధించిన ఈవెంట్లకు మాత్రమే అక్కడకు వెళ్లానే తప్పించి.. మరే తప్పు చేయలేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

తాను సినిమాల్లో నటించటంతో పాటు.. పలుఈవెంట్లను కూడా నిర్వహిస్తుంటానని.. ఈ క్రమంలోనే మరో ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్ తో పరిచయమైందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఫోటోలు దిగటం జరిగిందని పేర్కొన్నట్లుగా సమాచారం. ఈవెంట్లకు సంబంధించిన వివరాలు.. చర్చించినట్లుగా చెబుతున్న ఫోన్.. వాట్సాప్ సంభాషణల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఈడీ అధికారులుకోరినట్లుగా 2016-18 మధ్య కాలానికి సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్లను కూడా అధికారులకు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మిగిలిన వారితో పోలిస్తే.. నవదీప్ విచారణ మరింత టైట్ గా సాగినట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలుబయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News