అమీర్ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది

Update: 2018-09-15 05:03 GMT
మామూలుగా ఒక దర్శకుడు సినిమా బాగా తీస్తాడని పేరుంటుంది. ఆ దర్శకుడి సినిమా అయితే కచ్చితంగా బాగుంటుందన్న భరోసా ఉంటుంది. కానీ ఒక హీరో సినిమా అద్భుతంగా ఉంటుందని.. అతడి సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రేక్షకుల్లో నమ్మకం కుదరడం అరుదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇలాంటి గుర్తింపే సంపాదించాడు. ‘లగాన్’ దగ్గర్నుంచి గొప్పగా సాగుతోంది అమీర్ ప్రయాణం. ఈ దశాబ్దంన్నరలో అతడి నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలొచ్చాయి. చివరగా అమీర్ నటించిన ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. దీని తర్వాత అమీర్ నుంచి రాబోయే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద కూడా భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం చడీచప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా దాదాపుగా పూర్తి కావచ్చినట్లు సమాచారం. ఐతే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా ఏ చిన్న విశేషం బయటికి రాలేదు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. ఐతే నేరుగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. అందుకు ముహూర్తం కూడా కుదిరినట్లు సమాచారం. సెప్టెంబరు 27న యశ్ చోప్రా జయంతి కానుకగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ట్రైలర్ విడుదల చేస్తారట. ఈ చిత్రాన్ని యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ఈ సంస్థలో ‘ధూమ్’ సిరీస్ తొలి రెండు చిత్రాలకు కథ అందించి.. మూడో చిత్రానికి దర్శకత్వం కూడా చేసిన విజయ్ కృష్ణ ఆచార్య ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ను రూపొందిస్తున్నాడు. 1839లో వచ్చిన ఒక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా నవంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News