గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు.. అమెజాన్ తో ఒప్పందం!

Update: 2020-12-15 12:30 GMT
సినిమా అంటే అదో రంగుల ప్రపంచం.. కోట్ల రూపాయల వ్యాపారం..  కానీ కరోనా రాకతో సినిమా బంద్ అయిపోయింది. షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ థియేటర్లపై పడింది. కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు ఓటీటీలు వచ్చేశాయి. జనాలు వాటికే బానిస అవుతున్నారు.

ఇప్పటికే అమెజాన్ ‘ప్రైమ్’ తీసుకొచ్చి సినిమా థియేటర్లను దెబ్బకొట్టిన సంస్థ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టిందట.. తాజాగా అమెజాన్ సంస్థ ఖాళీగా ఉన్న థియేటర్లను పెద్ద ఎత్తున లీజుకు తీసుకుంటోందట.. సినిమాల కోసం కాదు.. వాటిని రెడీమేడ్ గోడౌన్లుగా మార్చేయడానికని సమాచారం.

భారత్ లో రీటెయిల్ మార్కెట్ పై పట్టు సాధించాలన్నది అమెజాన్ లక్ష్యం. ఆర్డర్ చేసిన ఐటమ్ ను అత్యంత వేగంగా కస్టమర్ కు చేరవేయడం ద్వారా రీటెయిల్ రంగంలో ఆధిపత్యం సాధించవచ్చని సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మూతపడడానికి సిద్ధమైన థియేటర్లను తీసుకొని ఎక్కడికక్కడ గోడౌన్లుగా సిద్ధం చేయాలని అమెజాన్ సంస్థ నిర్ణయించింది.

ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్రాలు అనుమతి ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకులు ఎవరూ థియేటర్ల వైపుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అపారనష్టంతో థియేటర్ల యజమానులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. థియేటర్లు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మల్టీప్లెక్స్ లు పెరగడంతో సింగిల్ థియేటర్లు పునరుద్దరించే సూచనలు కనిపించడం లేదు.

దీంతో థియేటర్లను నడిపించలేక.. అమ్ముకోలేక యజమానులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అమెజాన్ క్యాష్ చేసుకుంటోంది. రెట్టింపు ఆదాయం ఆఫర్ చేసి థియేటర్లను లీజుకు తీసుకునే దిశగా అమెజాన్ అడుగులు వేస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో అమెజాన్ అతిపెద్ద గోడౌన్ ఉంది. ఇప్పుడు స్థానిక నగరాల్లో థియేటర్లను తీసుకొని వాటిని గోడౌన్లుగా మార్చడంపై దృష్టిపెట్టింది.
Tags:    

Similar News