బాకీ వసూలుకు వెళ్లి సినిమా డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం

Update: 2020-10-09 11:30 GMT
హైదరాబాద్ లో ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ అదృశ్యమవ్వడం కలకలం రేపింది. బాకీ వసూలు చేస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యమయ్యాడు. మూడు రోజులైన తండ్రి డిస్ట్రిబ్యూటర్ ఇంటికి రాకపోవడంతో అతడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బేగంపేటకు చెందిన వి.నగేష్ (62) సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే యూసుఫ్ గూడకు చెందిన సజ్జుకు రూ. 5 లక్షల రూపాయలు బాకీ ఇచ్చాడు.

సజ్జు నుంచి రూ.5 లక్షల బాకీ వసూలు చేసేందుకు వెళుతున్నానని ఈనెల 6న ఇంటి నుంచి బయలు దేరాడు. అదే రోజు రాత్రి 10.30 గంటల నుంచి నగేష్ ఫోన్ నంబర్ కు కుటుంబ సభ్యులు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.

దీంతో కంగారుపడిన నగేష్ కుమార్తె సింధూజ.. డైరెక్టుగా సజ్జు కార్యాలయానికి వెళ్లి తండ్రి గురించి ఆరా తీసింది. అక్కడ తండ్రి చెప్పులు, ద్విచక్రవాహనం కనిపించింది. తండ్రి జాడ మాత్రం తెలియరాలేదు.

దీంతో ఆమె వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News