డైలమాలో రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటు? 'కరోనా'నే కారణం.. ఆలస్యంపై అభిమానులకు తలైవా లేఖ

Update: 2020-10-28 17:30 GMT
తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడునెలలు ఉన్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు సూపర్​స్టార్​ రజనీకాంత్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నది. అయినప్పటికీ రజనీకాంత్​ కొత్తపార్టీ ఏర్పాటుపై ఎటువంటి ప్రకటన రావడం లేదు. దీంతో రజనీ పార్టీ అసలు ఉంటుందా లేదా అనే విషయమై సోషల్ మీడియా, తమిళనాడు సినీ, రాజకీయ సర్కిళ్లలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్​ అభిమానులకు ఓ లేఖ రాసినదంటూ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

ఇంతకూ ఆ లేఖలో ఏమున్నదంటే.. ‘ అభిమానులు,ప్రజలు నాకు దేవుళ్లు. వారికి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల మేలుకోసం నేను రాజకీయపార్టీని పెట్టాలనుకున్నాను. ఈ మేరకు ప్రకటన కూడా చేశాను. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మదురైలో అక్టోబర్​ 2న భారీసభ నిర్వహించి పార్టీ పేరు, జెండా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అదే సమయంలో కరోనా రావడంతో నా నిర్ణయానికి బ్రేక్​ పడింది. ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. 2011లో నాకు కిడ్నీ సమస్య వచ్చింది. సింగపూర్​లో వైద్యం చేయించుకున్నాను. అయితే 2016లో కిడ్నీ సమస్య తిరగదోడింది. అప్పుడు అమెరికా వెళ్లి కిడ్నీ మార్పిడి చేయించుకున్నాను. ఈ విషయం నా సన్నిహితులకు మాత్రమే తెలుసు. మరోవైపు కరోనా వ్యాక్సిన్​ ఎప్పుడు వస్తుందో తెలియదు.

నాకు కిడ్నీ మార్పిడి జరగడం వల్ల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల నేను ఎవరిని కలుసుకోలేకపోతున్నాను. నాకు ప్రాణభయం ఏమీ లేదు. నమ్ముకున్న వాళ్ల క్షేమం కోసమే మాత్రమే నేను బాధపడుతున్నా. నేను ప్రారంభించబోయేది కొత్తపార్టీ ఇందుకోసం బహిరంగసభలు, సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది. కేవలం సోషల్​మీడియా నమ్ముకుని మాత్రమే ప్రచారం చేస్తే సరిపోదు. దీంతో నేను ఆశించిన రాజకీయవిప్లవాన్ని సాధించలేను. ఈ విషయాన్ని ప్రస్తుతం వెల్లడించడానికి కారణం అభిమానులు, ప్రజలు నా పొలిటికల్​ ఎంట్రీ కోసం వేచిచూడటమే. ఒకవేళ నేను రాజకీయ పార్టీ ప్రారంభిస్తే జనవరి 15 లోపే స్టార్ట్​ చేయాలి. అందుకోసం డిసెంబర్​లో నేను నిర్ణయాన్ని ప్రకటిస్తాను. నా రాజకీయ ఎంట్రీ కోసం నేను సుధీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటాను.

నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా అభిమానులు, ప్రజలు నాకు మద్దతు తెలపాలి’ అంటూ రజనీ రాశారని చెబుతున్న ఓలేఖ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. కాగా ఈ విషయంపై రజనీ అభిమాన సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఈ విషయం మాకు తెలియదని ఏదైనా ఉంటే రజనీకాంతే స్వయంగా ప్రకటిస్తారని వాళ్లు చెబుతున్నారు. కాగా రజనీ రాశారంటూ ఓ ఉత్తరం బయటకు రావడం.. మరోవైపు ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా.. రజనీ నుంచి ఏ ప్రకటన రాకపోవడంతో ఆయన పొలిటికల్​ ఎంట్రీపై కొంత సందిగ్ధం నెలకొంది.
Tags:    

Similar News