టైమ్స్ స్క్వేర్ ఏరియా బిల్ బోర్డ్ లో RRR

Update: 2021-12-22 06:34 GMT
2022 సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న అత్యంత క్రేజీ పాన్ ఇండియా మూవీ RRR. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా ఇటు సౌత్ అటు నార్త్ తో పాటు యుఎస్ లో కూడా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌చారంలోనూ వేగం పెంచారు. తాజాగా ఎన్టీఆర్ తమ చిత్రం అరుదైన ఘ‌న‌త‌ సాధించినందుకు గర్వించదగిన క్షణాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

అమెరికాలోని న్యూయార్క్ - మన్ హట్టన్ లోని పాపుల‌ర్ టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలోని బిల్ బోర్డ్ లో ఒకదానిపై RRR పోస్టర్ కనిపించే ఒక స్నాప్ ను ఎన్టీఆర్ అభిమానుల‌కు పంచుకున్నారు. అరుదుగా కొన్ని భారతీయ చలనచిత్రాలు మాత్రమే అక్కడ ప్రదర్శించబడినందున ఇది సాధారణ ఫీట్ కాదు. ఇది సంచలనానికి ప్ర‌తీక‌. ప్ర‌చారం ప‌రంగా మ‌రో స్థాయికి తీసుకువెళ్లిన‌ట్టేన‌ని అభిమానులు భావిస్తున్నారు.

RRR ప్రస్తుతం USలో క్రేజీ ప్రీ-బిజినెస్ ను అందుకుంటోంది. ఆర్.ఆర్.ఆర్ కోసం దాదాపు 350కోట్లు పైగా బ‌డ్జెట్ ని వెచ్చించార‌ని టాక్ ఉంది. 1000 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని జ‌క్క‌న్న-దాన‌య్య‌ టీమ్ టార్గెట్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

#RRR .. అప్పుడే ప్రీబుకింగ్ రికార్డులు

ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. ఈ మూవీ కి ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగా భారీ హైప్ నెల‌కొంది. RRR కోసం USA అంతటా ఉన్న ప్రధాన సినిమా చైన్ లు ముందస్తు బుకింగ్ లను తెరిచాయి. దీంతో ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ అమెరికాలో కొత్త రికార్డులను సృష్టిస్తోంద‌ని స‌మాచారం. RRR ప్రీమియర్ ల టికెట్స్ ప్రీ సేల్స్ 175K డాల‌ర్లు వద్ద జరిగాయి. ఈ చిత్రం కేవలం కొన్ని గంటల్లోనే 175K డాల‌ర్ల‌ను వసూలు చేయగలిగింది. రోజులు గడిచేకొద్దీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

మరే ఇతర తెలుగు సినిమా ఇలాంటి రికార్డును సాధించలేదు. విడుదలకు కొన్ని రోజుల ముందు అమ్మకాల నుండి 175K డాల‌ర్లు వసూలు చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే RRR ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం 7 జనవరి 2022 నుండి థియేటర్లలో అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ అంత‌ర్జాలంలోకి దూసుకెళ్లింది.

అమెరికాలో టికెట్ త‌క్కువ రేట్ లో

ఇంత‌కుముందు అమెరికా ఎగ్జిబిష‌న్ వ‌ర్గాలు ఇష్టానుసారం ధ‌ర‌ల్ని పెంచుకుని బాహుబ‌లి టిక్కెట్లు అమ్మార‌న్న అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో ఆగ్రహం కట్ట‌లు తెంచుకుని ఈ సినిమాని బ‌హిష్క‌రించాలి అన్నంత కోపోద్రిక్తుల‌య్యార‌ని టాక్ వినిపించింది.

బాహుబలి 2 ప్రీమియర్ షోల టిక్కెట్ల ధర 30 డాల‌ర్ల‌ను అధిగమించి 40డాల‌ర్ల వ‌ర‌కూ కూడా వ‌సూలు చేశారు అప్ప‌ట్లో. ఇది ఒక రకమైన ఆగ్రహానికి కార‌ణ‌మైంది. అసమంజసంగా అధిక టిక్కెట్ ఛార్జీల కారణంగా సినిమాను బహిష్కరించాలనే భావన ఏర్ప‌డింది. అయితే ఈసారి అలాంటి త‌ప్పిదం చేయకుండా ఆర్.ఆర్.ఆర్ నిర్మాత‌లు సాధార‌ణ ధ‌ర‌ల‌తోనే ప్రీమియ‌ర్ ల‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

అమెరికాలో దాదాపు 999 మల్టీప్లెక్స్ లలో విడుదల కానుంద‌ని పంపిణీదారులు ప్రకటించారు. అమెరికాలో వేరొక భార‌తీయ సినిమా ఏదీ ఇంత పెద్ద రేంజులో విడుద‌ల కాలేదు అంటే అతిశ‌యోక్తి కాదు.

RRR పంపిణీదారులు ప్రేక్ష‌కుల‌తో స్నేహపూర్వక విధానాన్ని అనుస‌రిస్తూ టిక్కెట్ ను సరసమైన ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. RRR ప్రీమియర్‌ల (తెలుగు వెర్షన్) టిక్కెట్ ల ధర సాధారణ స్క్రీన్ లలో 25 డాల‌ర్లు(పెద్దలు)... 18 డాల‌ర్లు (పిల్లలు) .. పెద్ద ఫార్మాట్ స్క్రీన్ లలో 28 డాల‌ర్లు(పెద్దలు).. 20 డాల‌ర్లు(పిల్లలు)గా నిర్ణయించారు. ఐమాక్స్ -డాల్బీ విజన్ స్క్రీన్ ల టిక్కెట్ ల ధర వరుసగా 30 డాల‌ర్లు..35 డాల‌ర్లుగా ఉన్నాయి.

సాధారణ ప్రదర్శనలకు 22 డాల‌ర్లు..ఐమ్యాక్స్ కి 30 డాల‌ర్లు.. డాల్బీ విజ‌న్ కి 35డాట‌ర్ల వ‌ర‌కూ ఛార్జీలు వ‌సూలు చేస్తున్నారు. ఇవి న్యాయ‌బ‌ద్ధ‌మైన ధ‌ర‌లు. అందువ‌ల్ల సినిమాపై పాజిటివిటీ నెల‌కొంటుంది. లాంగ్ ర‌న్ లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించే వీలుంటుంది. RRR సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి7న‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది.
Tags:    

Similar News