పైరసీ వెబ్ సైట్ ఎంత ఘోరం చేసిందంటే..

Update: 2017-02-17 06:26 GMT
తమిళ సినిమాలు విడుదలైన రోజు రాత్రికే పైరసీ వెబ్ సైట్లలో దర్శనమిస్తాయన్న సంగతి బహిరంగ రహస్యం. ఆ వెబ్ సైట్లు ఏవని తమిళ సినీ జనాలందరికీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ మధ్య సూర్య సినిమా ‘ఎస్-3’ విడుదలకు సిద్ధమవుతుంటే.. రిలీజ్ రోజు ఉదయం 11 గంటలకల్లా తమ వెబ్ సైట్లో ఆ చిత్రాన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తామంటూ బరి తెగించి ప్రకటన కూడా చేసింది ‘తమిల్ రాకర్స్’ అనే పైరసీ వెబ్ సైట్. వాళ్లు అన్నట్లుగా 11 గంటలకు సినిమాను పెట్టలేదు కానీ.. ఇప్పుడు ఆ వెబ్ సైట్లోకి వెళ్తే ‘ఎస్-3’ సినిమాను నిక్షేపంగా చూడొచ్చు. ఇప్పుడు అదే వెబ్ సైట్ ఘోరమైన పని చేసింది. ఇంకా విడుదలే కాని సినిమాను తీసుకొచ్చి తన వెబ్ సైట్లో పెట్టేసింది.

తమిళంలో ‘లైట్ మన్’ పేరుతో అందరూ కొత్తవాళ్లు కలిసి ఒక ప్రయోగాత్మక సినిమా చేశారు. కొన్నాళ్ల కిందట రిలీజైన దీని ట్రైలర్ విభిన్నంగా అనిపిస్తూ ప్రశంసలందుకుంది. సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుందన్న ఫీలింగ్ జనాలకు కలిగింది. ఐతే ఈ చిత్రం ఇంకా థియేటర్లలోకి వెళ్లకముందే పైరసీ వెబ్ సైట్లోకి వెళ్లిపోయింది. యూనిట్లోనే ఎవరో సినిమాను కాపీ చేసి పైరసీ వెబ్ సైట్ కు అందజేసినట్లున్నారు. రిలీజయ్యాక పైరసీ అయితే ఒక లెక్క కానీ.. ఇంకా థియేటర్లలోకే వెళ్లని సినిమాను కూడా పైరసీ చేసి పెట్టేయడం కంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఇది ఆ చిత్ర దర్శక నిర్మాతల్ని ఎంత వేదనకు గురి చేస్తుందో అంచనా వేయొచ్చు. ఇప్పటికైనా పైరసీ వెబ్ సైట్ల పని పట్టే కార్యానికి తమిళ పరిశ్రమ శ్రీకారం చుట్టకపోతే.. మున్ముందు సినిమాలే తీయలేని పరిస్థితి తలెత్తవచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News