ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్.. టైటిల్ పాత్ర‌లో ఎవ‌రు?

Update: 2020-02-18 10:45 GMT
ఎన్టీఆర్ జీవిత‌ క‌థ‌తో మూడు బ‌యోపిక్ లు వ‌చ్చాయి. వీటిలో రెండిటి (ఎన్టీఆర్-క‌థానాయ‌కుడు.. మ‌హానాయ‌కుడు)లో బాల‌కృష్ణ న‌టించ‌గా.. ఒక‌దాంట్లో(ల‌క్ష్మీస్ ఎన్టీఆర్) ఒక డ్రామా ఆర్టిస్టు న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించే అరుదైన అవ‌కాశం శతాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ ద‌క్కించుకున్నారు. అత‌డు అన్న‌గారిగా అభిన‌యించేందుకు రెడీ అవ్వ‌డం ఆస‌క్తిక‌రం.

అయితే ఇది వెండితెర‌పైనేనా? అంటే సినిమా కాదు.. వెబ్ సిరీస్ ప్ర‌య‌త్నం. అది కూడా ఎన్టీఆర్ కి అత్యంత స‌న్నిహితుడైన మంచు మోహ‌న్ బాబు ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం లో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో చీక‌టి కోణాల్ని.. క‌ఠోర నిజాల్ని ఈ వెబ్ సిరీస్ లో ఓపెన్ గా చూపిస్తున్నార‌ట‌. ఇక అన్న‌గారు ఎన్టీఆర్ తో మోహ‌న్ బాబు అనుబంధం గురించి తెలిసిందే. త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం స‌హా సినిమాల ప‌రంగానూ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం ఎంతో గొప్ప‌ది. ఎన్టీఆర్ న‌టించిన చివ‌రి చిత్రం `మేజర్ చంద్రకాంత్` ని మోహన్ బాబు నిర్మించారు. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో మంచు విష్ణు పాలు పంచుకుంటున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ సిరీస్ కి చ‌ద‌రంగం అనే టైటిల్ ని పెట్టారు.

ఈ వెబ్ సిరీస్ కి రాజ్ అనంత దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస శర్మ సంగీతం అందిస్తుండ‌గా.. రనాల్ ఛాయాగ్రాహ‌కుడిగా ప‌ని చేస్తున్నారు. జీ5 ఒరిజిన‌ల్ సిరీస్ ఇది. త్వరలో OTT వేదిక‌పై ప్రసారం కానుంది. ఎన్టీఆర్ పై మూడు సినిమాలు వ‌చ్చినా ఏవీ మెప్పించ‌లేక‌పోయాయి. ఎన్టీఆర్ గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసిన నిజాల్నే తెర‌పై చూపించ‌డంలో ద‌ర్శ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. అయితే ఆ త‌ప్పు మ‌రోసారి చేయ‌క‌పోతేనే ఇప్పుడు వెబ్ సిరీస్ ని జ‌నం చూసే వీలుంటుంది.


Tags:    

Similar News