క్యాన్స‌ర్ చికిత్స త‌ర్వాత `ఖ‌ల్ నాయ‌క్` సీక్వెల్ కి రెడీ!

Update: 2020-10-10 06:15 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్ర‌తిష్ఠాత్మ‌క `కేజీఎఫ్ 2`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సంచ‌ల‌నాల కేజీఎఫ్ కి సీక్వెల్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో అధీరా అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాక్ స్టార్ య‌ష్ కి విల‌న్ సంజూ భాయ్ కి మ‌ధ్య పోరాటాలు ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని అభిమానులు అంచనా వేస్తున్నారు. అధీరా పాత్ర‌ధారిపై ఇంత‌కుముందు కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర‌బృందం తెర‌కెక్కించింది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 రిలీజ్ గురించిన చ‌ర్చ సాగుతున్న ఈ స‌మ‌యంలో సంజూ భాయ్ కి అనూహ్యంగా క్యాన్స‌ర్ చికిత్స జ‌ర‌గ‌డం అభిమానుల్ని కంగారు పెట్టింది.

ఇంత‌కీ క్యాన్స‌ర్ చికిత్స త‌ర్వాత సంజ‌య్ ద‌త్ ఎలా ఉన్నారు? అన్న‌దానికి ఇదిగో ఈ లేటెస్టు ఫోటోనే సాక్ష్యం. ఇటీవల ఇంటర్నెట్లో రౌండ్లు చేస్తున్న సంజూ ఫోటో నెటిజన్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చాలా మంది భాయ్ అభిమానులు  శ్రేయోభిలాషులు ర‌క‌ర‌కాల‌ వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు. ఆసుపత్రి నుండి పిక్చర్ వైరల్ అయిన తర్వాత అతని ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

“బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాను`` అని.. ఒక అభిమాని వీడియోని వైర‌ల్ చేశారు. తాజాగా రివీలైన ఫోటోల‌ చెంప ఎముకలు పైకి క‌నిపిస్తూ బాబా బుగ్గలు బాగా లాగి ఉన్నాయి. క‌ళ్లు గుంట‌లు ప‌డి క‌నిపిస్తున్నాడు. పండిన గ‌డ్డం మీసం తో పాటు శ‌రీరాకృతి చాలా స‌న్న‌గా మారిపోయింది. ఇదంతా క్యాన్స‌ర్ కోసం ఉప‌యోగించే క‌ఠిన‌మైన కీమో థెర‌పీ ప్ర‌భావం అంటూ అభిమానులు భావిస్తున్నారు.

ఇక భాయ్ ప్ర‌స్తుత స‌న్నివేశాన్ని విశ్లేషించిన ప్ర‌ముఖ నిర్మాత సుభాష్ ఘాయ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంజూకి క్యాన్సర్ చికిత్స అయ్యాక `ఖల్ నాయక్ రిటర్న్స్` (సీక్వెల్) గురించి తన ప్రణాళికల్లో మార్పులొచ్చాయ‌ని వెల్ల‌డించారు. సంజూ జీవితంలో ముందు ఎదుర్కొన్నదానికి అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డి బిగ్ బ్యాంగ్ తో తిరిగి వస్తార‌ని నమ్ముతున్నాను అన్నారు.

సంజయ్ దత్ నా కళ్ళముందు పెరిగాడు. అతను 10 సంవత్సరాల వయస్సు నుండి నాకు తెలుసు. రాకీ తరువాత అతని రెండవ చిత్రం విధాత కు నేనే ర‌చ‌యిత‌. అప్పుడు ఖల్ నాయక్ ఆఫ‌ర్ వచ్చింది. అది పెద్ద హిట్. అతని జీవితంలో ఒక స్మారక చిత్రం. అది కూడా నాతో ఉంది. వాస్తవానికి మేము ఖల్ నాయక్ రిటర్న్స్ కి కలిసి ప‌ని చేయాలనుకుంటున్నాం. అతను చాలా బలమైన వ్యక్తి కాబట్టి అతని ఆరోగ్యం మెరుగుపడాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. అతను జీవితంలో చాలా చూశాడు. చీకటి.., తుఫానులు .. పర్వతాలతో పోరాడగల శ‌క్తి. క్యాన్స‌ర్ నుంచి కోలుకుని అతను తిరిగి వస్తాడు. మళ్ళీ కీర్తి పొందుతాడు. అతను బ్యాంగ్ తో తిరిగి వస్తాడు`` అంటూ ఘాయ్ ఎమోష‌న్ అయ్యారు.
Tags:    

Similar News