సీత‌ను రావ‌ణుడు అప‌హ‌రించ‌డం మాన‌వ‌తా? సారీ అనేస్తే చాల‌దు హీరోగారూ!

Update: 2020-12-07 06:43 GMT
మాట తీరులో సౌండింగ్ తేడా వినిపిస్తే ఎడా పెడా వాయించేస్తున్నారు కామ‌న్ జ‌నం. ఇది అస‌లే మ‌నోభావాలు దెబ్బ తినే సీజ‌న్. తాము ఆరాధించే దేవుళ్ల‌ను ఎవ‌రైనా కించ‌ప‌రిచినా మ‌తాల్ని ట‌చ్ చేసినా భావోద్వేగానికి గుర‌వుతున్నారు. పైగా ప్ర‌తిదానికి సంఘాలు పుట్టుకొచ్చి నానా రాద్ధాంతం చేస్తుండ‌డంతో చాలా సినిమాల‌కు అది ఆటంకంగానే మారింది. ఇప్పుడు ప్ర‌భాస్ కి ఇలాంటి ఇబ్బంది ఎదుర‌వ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు న‌టిస్తున్న‌ `ఆదిపురుష్ 3డి` దేవుళ్ల‌పై సినిమా కావ‌డంతో ఎన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సినిమా వివాదాస్ప‌దం కావ‌డం ఖాయ‌మ‌ని రిలీజ్ విష‌యంలో ఇబ్బంది త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే స‌మీక్ష‌కులు చెబుతున్నారు.

మొన్న‌టికి మొన్న సైఫ్ అలీఖాన్ `రావ‌ణ్‌` పోస్ట‌ర్ రిలీజైంది. ఆ త‌ర్వాత  ఓ ఇంట‌ర్వ్యూలో సైఫ్ చేసిన వ్యాఖ్య‌లు హిందువుల మ‌నోభావాల్ని దెబ్బ తీయ‌డం.. శ్రీ‌రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైరింగ్ కి తెర లేవ‌డం తెలిసిన‌దే.  సీత‌ను అప‌హ‌రించిన రావ‌ణుడిని త‌ప్పుగా చూపించ‌రు. పైగా ఆ రాక్ష‌స రాజు ఎంతో గొప్ప మాన‌వ‌తావాదిగా తెర‌పై క‌నిపిస్తార‌ని సైఫ్ అన‌డంతో వివాదం రాజుకుంది. రామాయ‌ణం ప్రాశ‌స్థ్యాన్ని దెబ్బ తీస్తూ ఈ సినిమా తీస్తున్నారా? అంటూ మాట‌ల తూటాలు పేల్చి క‌ళ్ల‌తోనే బాణ‌సంచా కాల్చారు.

ఈ దెబ్బ‌కు దిగొచ్చిన సైఫ్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పి తన వివాదాస్పద `మానవత్వ రావణ్‌` వ్యాఖ్య‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. ``ఆదిపురుష్` చెడుపై మంచి సాధించే విజయాన్ని సెల‌బ్రేట్ చేయ‌డం.. !!`` అంటూ క‌వ‌ర్ చేశారు సైఫ్‌. సోష‌ల్ మీడియా వ్య‌తిరేక‌త‌కు భ‌య‌ప‌డి హ్యూమ‌న్ రావ‌ణ్ అనే వ్యాఖ్య‌ను ఉప‌సంహ‌రించుకున్నారు.

సైఫ్ ఏమ‌న్నారంటే.. ``ఒక ఇంటర్వ్యూలో నా ఒక ప్రకటన వివాదానికి కారణమైందని ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని నాకు తెలుసు. ఇది నా ఉద్దేశ్యం కాదు.  ఆ విధంగా ఉద్దేశించలేదు. నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పి నా వ్యాఖ్య‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. లార్డ్ రామ్ ఎల్లప్పుడూ  ధర్మానికి వీరత్వానికి చిహ్నంగా ఉన్నారు. ఆదిపురుష్ చెడుపై మంచి విజయాన్ని జరుపుకోవడం గురించిన సినిమా. ఎక్క‌డా వక్రీకరణ లేకుండా ఇతిహాసాన్ని ప్రదర్శించడానికి టీమ్ కృషి చేస్తోంది`` అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.

గ‌త ఇంట‌ర్వ్యూలో సైఫ్ చెప్పిన వెర్ష‌న్ ఎలా ఉంది? అంటే.. ``నేను ఒక రాక్షస రాజుగా నటించడం ఆసక్తికరంగా ఉంది. ఈ పాత్ర‌కు  తక్కువ కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ పాత్ర‌ను మానవత్వం కోణంలో చూపిస్తున్నారు. రావ‌ణ్‌ సీతను అపహరించి రామ్ ‌తో చేసిన యుద్ధాన్ని ప్రతీకారంగా సమర్థిస్తాం. త‌న సోద‌రి సూర్ప‌ణ‌ఖ‌ ముక్కును కత్తిరించిన లక్ష్మణుడి పై పోరాటం కోణంలో చూపిస్తున్నాం!`` అంటూ రామాయ‌ణం క‌థ‌ను రివర్సులో చెప్ప‌డంతోనే స‌మ‌స్య మొద‌లైంది.  

ఇది చాలా మందికి న‌చ్చ‌లేదు.  సోష‌ల్ మీడియాల్లో తమ కోపాన్ని వ్యక్తం చేశారు కొంద‌రు. బీజేపి నాయకుడు రామ్ కదమ్ కూడా సైఫ్ అలీఖాన్ కి స‌మ‌ర్ధ‌న‌గా ఆదిపురుష్ గురించి చాలా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రావణ్‌ పాత్రలో నటించిన సైఫ్ పాత్ర పాజిటివ్ గా ఉండేలా.. సీతమ్మ‌ను రావణ్ అపహరించడం ఈ చిత్రంలో సమర్థించబడుతుందని చెప్పారు. రావణుడి మానవత్వం చూపిస్తారు. శ్రీరామునికి వ్యతిరేకంగా అతని యుద్ధం సమర్థించబడుతుంది! అంటూ షాకిచ్చారు. అన్న‌ట్టు అగ్గి రాజేసిన సైఫ్ సింపుల్ గా సారీ అనేస్తే స‌రిపోతుందా? ఆయ‌న మ‌రుగుతున్న భావోద్వేగాల్ని ఆప‌గ‌ల‌రా?  కాస్త ఆగి చూద్దాం.
Tags:    

Similar News