యువీ సంస్థ‌కు క‌రోనా అలా క‌లిసొచ్చిందా?

Update: 2020-04-10 03:45 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన సాహో ర‌క‌ర‌కాల పాఠాల్ని నేర్పించింది. ఈ పాఠాల్ని ఇప్ప‌టికీ ప్ర‌భాస్- యువి క్రియేష‌న్స్ బృందం నెమ‌రు వేసుకుంటూనే ఉన్నారు. ఒక భారీ పాన్ ఇండియా సినిమా తీస్తే దాని అంతిమ ఫ‌లితం ఇన్ని ర‌కాలుగా ఉంటుంద‌ని అందులో న‌టించిన హీరో కానీ.. నిర్మాత‌లు కానీ.. లేదా ద‌ర్శ‌కుడు కానీ అస్స‌లు ఊహించి ఉండ‌నే ఉండ‌రు.

ఒక తెలుగు హీరో న‌టించిన సినిమా హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్.. కానీ తెలుగులో ఫెయిల్. పంపిణీదారుల‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. సౌత్ లో ఇరుగు పొరుగున ఇంకా పెద్ద పంచ్ ప‌డిపోయింది. అస‌లు బాహుబ‌లి స్టార్ అని జ‌నం ఏమాత్రం క‌నిక‌రించ‌లేదు. ఆరంభ‌మే నెగెటివ్ రివ్యూల ప్ర‌భావం వెంట‌నే చూపించేయ‌డంతో దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన యువీ క్రియేష‌న్స్ హిందీ క‌లెక్ష‌న్స్ వ‌ల్ల బ‌తికిపోయింది కానీ.. అంతే పెద్ద ఎత్తున న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చేది. దాదాపు 80 కోట్లు పైగానే న‌ష్టాలొచ్చాయ‌ని దానిని పూడ్చేందుకు చాలానే తంటాలు ప‌డ్డార‌ని కూడా ముచ్చ‌ట సాగింది. ప్ర‌భాస్ స్వ‌యంగా ప‌ర్స‌న‌ల్ గా పూచీక‌త్తు ఇచ్చి న‌ష్టాన్ని పూడ్చేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని ముచ్చ‌టించుకున్నారు.

అదంతా స‌రే కానీ.. ఇన్నాళ్లు పెండింగులో ఉండిపోయిన‌ ఈ సినిమా శాటిలైట్ డీల్ తాజాగా కుదిరింద‌ని తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ కి తెలుగు శాటిలైట్ రైట్స్ స‌హా ఇరుగు పొరుగు భాష‌ల రైట్స్ ని గంప‌గుత్త‌గా 20కోట్ల‌కు సెట్ చేశార‌ట‌. కేవ‌లం తెలుగు రైట్స్ కోసమే 12 కోట్లు రేట్ ఫిక్స్ చేశార‌న్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది. అయితే ఇంత పెద్ద మొత్తానికి రైట్స్ ప‌లికాయి అంటే క్రేజు బాగానే ఉన్న‌ట్టు. ఇప్ప‌టికే అమెజాన్ లాంటి చోట్ల సాహో చిత్రాన్ని జ‌నం ప‌దే ప‌దే చూసేశారు. అయినా శాటిలైట్ రైట్స్ బాగానే పలికింద‌ని భావించ‌వ‌చ్చు. మొత్తానికి కొంత‌లో కొంత న‌ష్టం పూడ్చుకునే వెసులుబాటు శాటిలైట్ క‌ల్పించింద‌న్న‌మాట‌. కరోనా క‌ల్లోలంలో జ‌నం టీవీల‌కు అతుక్కుపోతున్నార‌న్న వార్త‌ల‌తో ఇలా రేట్ ఎక్కువ ప‌లికిందంటారా?
Tags:    

Similar News