రమ్యకృష్ణ బలం .. బలగం ఆమె నటనే!

Update: 2021-01-25 01:30 GMT
నిన్నటితరం అందాల కథానాయికలలో రమ్యకృష్ణ ఒకరు. అసలైన గ్లామర్ కి తన నాజూకు తనంతో అర్థం చెప్పిన నాయిక ఆమె. ఆ తరువాత ఆమె కీలకమైన .. ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. 'బాహుబలి' సినిమాలో 'శివగామి'గా  రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించారు. కథానాయికగా ఒకప్పుడు తన అందచందాలతో అప్సరసలను గుర్తుచేసిన రమ్యకృష్ణేనా ఇంత గొప్పగా నటించింది? అని అంతా ఆశ్చర్యపోయారు. 'నరసింహా' సినిమాలో 'నీలాంబరి'గా ఒక కథానాయికగా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మెప్పించడం వేరు. 'బాహుబలి'లో ఒక తల్లిగా నెగెటివ్ షేడ్స్ తో శభాష్ అనిపించుకోవడం వేరు. కఠినత్వం .. కారుణ్యం కలిగిన ఈ పాత్రల్లో ఆమె నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.


ఒకప్పుడు రమ్యకృష్ణకి 'నీలాంబరి' పాత్ర ఎంతటి పేరు తెచ్చిందో .. 'శివగామి' పాత్ర అంతకు మించిన పేరు ప్రతిష్ఠలను తీసుకురావడం విశేషం. 'శివగామి' తెచ్చిన క్రేజ్ కారణంగా రమ్యకృష్ణకి అనేక అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక్క 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకి మించి మరే సినిమా ఆమె స్థాయికి తగిన విధంగా ఆకట్టుకోలేకపోయాయి. 'హలో' .. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. 'శైలజా రెడ్డి అల్లుడు' మీద జనానికి బాగానే హోప్స్ ఉండేవి కానీ, ఆ అంచనాలు తప్పాయి.


ఇక ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించారు. తెలుగుతో పాటు హిందీలోను విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆమె పాత్రను పూరి కొత్తగా డిజైన్ చేశాడని తెలిసిన దగ్గర నుంచి ప్రేక్షకులు మరింత ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. ఇక పూరి తనయుడు ఆకాశ్ పూరి చేసిన 'రొమాంటిక్' సినిమాలోను రమ్యకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని అంటున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. తన బలం ..బలగం అయిన నటనతో రమ్యకృష్ణ మరోసారి విజృంభిస్తోందన్న మాట.
Tags:    

Similar News