రజినీకాంత్ పర్యటనపై తీవ్ర దుమారం

Update: 2017-03-25 07:44 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ తెరమీద హీరోయిజం బాగానే చూపిస్తాడు కానీ.. నిజ జీవితంలో మాత్రం ఆయన వ్యవహార శైలిపై చాలా విమర్శలు వ్యక్తమవుతుంటాయి. రాజకీయాల గురించి కానీ.. ప్రజా సమస్యల గురించి కానీ.. ఏదైనా వివాదాలు తలెత్తినపుడు కానీ రజినీ మౌనాన్నే ఆశ్రయిస్తారు. ఆయన స్థాయి స్టేచర్ ఉన్న వ్యక్తి అలా మౌనం దాల్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంటాయి. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన అన్ని విషయాల్లోనూ మౌనం పాటిస్తుంటారు. శ్రీలంకలో తమిళుల ఊచకోత సాగుతున్నపుడు కూడా ఆయన అలాగే సైలెంటుగా ఉన్నారు. ఐతే అప్పటి రజినీ మౌనాన్ని ఇప్పటికీ శ్రీలంక తమిళులు మరిచిపోయినట్లు లేరు. తమ కోసం కట్టించిన ఇళ్ల ప్రారంభోత్సవానికి రజినీ వస్తాడని తెలియగానే వాళ్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. ఆందోళన బాట పట్టారు.

శ్రీలంకలోని తమిళ నిర్వాసితుల పురోగతి కోసం పనిచేస్తున్న జ్ఞానం ఫౌండేషన్ సంస్థ తాజాగా వారి కోసం 150 ఇళ్లను నిర్మించింది. విశేషమేంటంటే ఈ ఇళ్లను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా అందజేయాలని భావించారు. ప్రస్తుతం రజినీతో ‘2.0’ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ కరన్ అల్లిరాజా పేరిటే ఈ జ్ఞానం ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.22 కోట్లతో జాప్నా ప్రాంతంలో 150 ఇళ్లను ఆ సంస్థ నిర్మించింది. రజనీకాంత్ చేతుల మీదుగా ఏప్రిల్ 9న నిర్వాసితులకు అందజేయాలని అనుకున్నారు. ఆయన కోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఐతే రజినీ పర్యటనను స్థానిక తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్టీటీఈని శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోసినప్పుడు ఒక్కమాట కూడా మాట్లాడని రజినీకాంత్ ఇప్పుడు పర్యటనకు వస్తే అడ్డుకుంటామని స్థానిక తమిళ సంఘాలు మెచ్చరించాయి. వాటికి డీఎండీకే.. జీసీకే పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. చెన్నై నుంచే రజినీని అడ్డుకోవడానికి ఈ పార్టీలు ప్రణాళికలు రచించాయి. తన పర్యటనపై ముందే ఇలా దుమారం రేగడంతో రజినీ జాఫ్నాకు వెళ్లే ఆలోచనను మానుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News