మహిష్మతి అనే కొత్త ప్రపంచం సృష్టించాను

Update: 2015-06-28 07:43 GMT
ప్రస్తుతం ప్రపంచమంతా ఒకటే చర్చ. మగధీర, ఈగ చిత్రాల దర్శకుడి నుంచి బాహుబలి వస్తోంది. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. జూలై 10 నుంచి కలెక్షన్ల సునామీ షురూ.. అంటూ ప్రచారం సాగుతోంది. బాహుబలిలో ప్రభాస్‌ రెండు విభిన్నమైన పాత్రలు పోషించాడు. హీరో రానా రావణాసురుడి లాంటి భయంకరుడిగా కనిపిస్తాడు. అంతేకాదండోయ్‌ ఈ సినిమాలో ప్రతి పాత్రా దేనికదే ముఖ్యం. ఎనిమిది క్యారెక్టర్లు సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి.

ఈ సినిమా గురించి రాజమౌళి స్వయంగా ముచ్చటిస్తూ.. ''మహిష్మతి అనే ఓ ఊహాజనితమైన ప్రపంచాన్ని సృష్టించాను. ఆ సామ్రాజ్యం పూర్తిగా కల్పితం. అయితే రాజులు, రాజ్యాలు, కోటలు, ఘడీలు, కత్తి యుద్ధాలు ఇవన్నీ మహాభారతం, రామాయణం వంటి పురాణేతిహాసాల నుంచి తీసుకున్నవే. అమర్‌ చిత్రకథ కామిక్స్‌ నుంచి ఇన్‌స్పయిర్‌ అయ్యి రాసుకున్న కథాంశమే ఇది. నా ఊహల్లోని ప్రపంచమిది. అందువల్ల బాహుబలి అనే సినిమా సాధ్యమైంది''

కథంశాం విషయానికొస్తే... ''ఇద్దరు అన్నదమ్ములు రాజ్యం కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే నా సినిమా కథాంశం. దీనికోసం ఎంతోమంది సాంకేతిక నిపుణులు, నటీనటులు అహోరాత్రులు శ్రమించారు. ప్రీప్రొడక్షన్‌ కోసమే ఏడాది సమయం తీసుకున్నాం. ముందుగానే స్టోరీబోర్డ్‌, కాస్ట్యూమ్స్‌, సెట్స్‌ వంటి వాటి గురించి భారీగా కసరత్తు చేశాం. అలాగే నటీనటుల్ని పూర్తిగా పాత్రల్లోకి పరకాయం చేసేలా కసరత్తు చేయించాం. కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీలు, బాణాలు సంధించడం ఒకటేమిటి అన్నిటినీ ప్రాక్టీస్‌ చేయించాం. డైలాగ్స్‌ కూడా ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేశారు. ఇదంతా చేయడం వల్లే ఇంత సమయం పట్టింది'' అపి రాజమౌళి చెప్పారు.

తెలుగు, తమిళ్‌ ద్విభాషా చిత్రమిది. హిందీ, మలయాళంలోకి అనువదించి రిలీజ్‌ చేస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News