#GM28 మెమ‌రీస్.. బాబాయి చిరంజీవి అట‌!

Update: 2020-04-10 05:00 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ క్లాసిక్ హిట్స్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. 1980-90 లో సుప్రీం హీరోగా ఆయ‌న ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందుకున్నారు. కాల‌క్ర‌మంలో  మెగాస్టార్ గా కీర్తింప‌బ‌డ‌టానికి ఎన్నో చిత్రాలు ఇతోధికంగా సాయం అయ్యాయి. వాటిలో `ఘ‌రానా మొగుడు` సెన్సేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. 56 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వాలు.. 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడి బాక్సాఫీస్ అంచ‌నాల్నే తారుమారు చేసింది. తెలుగు సినిమా బాక్సాఫీస్ నే  కాదు.. ద‌క్షిణాది బాక్సాఫీస్ స్టామినా ఏంట‌న్న‌ది నిరూపించిన చిత్ర‌మ‌ది.

దేవి ఫిలింస్ ప‌తాకంపై దేవీవ‌ర‌ప్ర‌సాద్ నిర్మించిన ఆ చిత్రం వ‌సూళ్ల‌లో తుఫాన్ సృష్టించింది. 10 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి తెలుగు సినిమా బాక్సాఫీస్  స్థాయిని పెంచింది. అందులో చిరంజీవి మ్యాన‌రిజ‌మ్..డైలాగ్ డెలివ‌రి... బంగారు కోడిపెట్ట లాంటి పాట తెలుగు సినిమాకు కొత్త అర్ధాన్ని  తీసుకొచ్చాయి. చిరు కెరీర్ మ్యూజిక‌ల్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచింది. ఇక భీమ‌వ‌రం లో జ‌రిగిన  శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల‌ను ఓ గ్రౌండ్ లో ఏర్పాటు చేసారు. దీంతో అభిమానులు ఇసుకేస్తే రాల‌నంత భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు. వేదిక బ‌య‌ట అంతే జ‌నంతో కిక్కిరిసిపోయింది.  ఒక ఆ సినిమా ఓ క‌న్న‌డ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కింది. 1986లో రిలీజ్ అయిన `అనురాగ అర‌లితుకు` కి  ఘ‌రానా మొగుడు రీమేక్ రూపం. మాతృక‌లో ఆ చిత్రం అక్క‌డా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. కాన్నీ క‌న్న‌డ క‌న్నా తెలుగులో రీమేక్ రూపంలో అంత‌కుమించి సంచ‌ల‌నాలు న‌మోదు చేయ‌డం విశేషం.

స‌రిగ్గా ఈ సినిమా విడుద‌లై ఏప్రిల్ 9 నాటికి 28 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. 1992 ఏప్రిల్ 9న సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా రాఘవేంద్ర‌రావు చిరంజీవిని ఉద్దేశించి ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసారు. కాలం గ‌డిచిపోతుంది. కానీ నా బాబాయి చిరంజీవి తో `ఘ‌రానా మొగుడు` సినిమాకు ప‌నిచేసిన జ్ఞాప‌కాల‌ను మాత్రం మ‌ర్చిపో లేక‌పోతున్నా.  ఆ మ‌ధుర జ్ఞాప‌కాలు ఇప్ప‌టికే నా మ‌న‌సులో ప‌దిలంగా ఉన్నాయ‌ని  ఘ‌రానా మొగుడు సినిమాకు సంబంధించిన చిరంజీవి-న‌గ్మ  పాత ఫోటోల‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేసారు.
Tags:    

Similar News