లీకేజీ వ్యవహారంతో భద్రత కట్టుదిట్టం చేసిన 'పుష్ప' టీమ్..!

Update: 2021-08-18 02:30 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' అనే పేరుతో క్రిష్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్న మేకర్స్ కు.. సినిమాలోని కీలక సన్నివేశాలు లీక్ అవడం తలనొప్పి తెచ్చిపెడుతోంది.

'పుష్ప' ఫస్ట్ సింగిల్ 'దాక్కో దాక్కో మేక' మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్ ముందుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలానే గత వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ నెట్టింట వైరల్ అవుతోంది. వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ - షూటింగ్ ఫుటేజ్ కూడా లీక్ అయ్యాయి. ఓ ద‌శ‌లో నిర్మాత‌లు కావాల‌నే ఈ లీకులు చేస్తున్నార‌నే వార్త‌లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో లీకుల వ్య‌వ‌హారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ టీమ్ సీరియ‌స్‌ గా తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

'పుష్ప' చిత్రంలో కీలకమైన ఫైట్ సీన్స్ కు సంబంధించిన ఫుటేజ్ లీక్ అవడం పట్ల దర్శకుడు సుకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంతో నిర్మాతలు కంటెంట్ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ కారణం చేతనైనా ఇతర వ్యక్తులకు ఎలాంటి కంటెంట్ పంపవద్దని చిత్ర బృందానికి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రీ నిర్మాతలు మరోసారి దీనిపై స్పందించారు.

''సినిమాలకు సంబంధించిన మెటీరియల్ బిట్లు బిట్లుగా లీక్ అవడం మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. అనుకున్న టైం కంటే ముందే ఇలా బయటకు రావడంపై హీరోల ఫ్యాన్స్ కూడా డిస్టర్బ్ అయ్యారు. ఈ లీకులను మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు దీనిపై ఇన్వేస్టిగేషన్ చేస్తున్నారు. కచ్చితంగా త‌ప్పు చేసిన వారిని ప‌ట్టుకుని శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఇటువంటి ప‌నుల వ‌ల్ల ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేసి లైఫ్ రిస్క్ లో పెట్టుకోవద్దని కోరుతున్నాం'' అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియజేసారు.

కాగా, 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది హీరో అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తుండగా.. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్‌ - రావు రమేష్‌ - అజయ్‌ ఘోష్‌ - అనసూయ భరద్వాజ్‌ - ధనుంజయ్‌ - అజయ్‌ - శత్రు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'పుష్ప' చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. DSP కంపోజిషన్ లో ఇటీవల వచ్చిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్ విశేష స్పందన తెచ్చుకొని, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీకి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్‌ యెర్నేని - వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
Tags:    

Similar News