అందుకే అల అలాంటి వీడియోలు పెట్టదట!

Update: 2020-05-03 11:30 GMT
సాధారణ ప్రజలు ఎప్పుడూ బిజీగా ఉన్నామని అంటూ ఉంటారు. సెలబ్రిటీలు ఎప్పుడూ బిజీగా ఉంటారు. అయితే ఈ ఈ లాక్ డౌన్ కారణంగా బిజీగా ఉంటామని చెప్పేవారు.. నిజంగా బిజీగా ఉండేవారు అందరూ ఇప్పుడు చేసేదేమీ లేక ఇంట్లో కూర్చుని ఉన్నారు.  హీరోలేమో అంట్లు తోముట.. అట్లు వేయుట లాంటి అతి క్లిష్టమైన పనులను అవలీలగా చేస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. హీరోలు ఇంటి పనులను కబ్జా చెయ్యడంతో హీరోయిన్లకు ఏమీ తోచడం లేదు. ఫిట్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ కాలం గడుపుతున్నారు.

అయితే  పూజా హెగ్డే మాత్రం ఎక్కువగా ఆ కసరత్తుల వీడియోల జోలికి.. లైవ్ లో ఎక్సర్ సైజులు చెయ్యడం లాంటి పనుల జోలికి పోవడం లేదు.  సాధారణమైన ఫోటోలతోనే సరిపెడుతోంది. ఏదో ఒకటి రెండు సార్లు మాత్రం యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది.  ఈ విషయంపై ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ "ఫిట్ నెస్ విషయంలో నేనేమీ ఎక్స్ పర్ట్ ను కాదు. ఏదో ఒక ఫిట్ నెస్ వీడియో పెట్టదలుచుకోలేదు. లైవ్ సెషన్ కూడా చెయ్యలేదు.  ఎందుకంటే నాకు ఆ అర్హత ఉందో లేదో తెలియదు. అయితే సోషల్ మీడియాలో చాలా వర్క్ అవుట్ వీడియోలు ఉన్నాయి కదా?" అంటూ చెప్పుకొచ్చింది.

నిజమే కదా... అట్టు అటూ ఇటూ తిప్పే వీడియో చూసి అలా చెయ్యలేక ఫెయిల్ అయితే జస్ట్ కిచెన్ క్లీనింగ్ తో సరిపోతుంది. అదే శీర్షాసనం..  కరోనాసనం..  ట్రంపాసనం లాంటివి ఏవో చెయ్యబోతూ తేడా కొడితే నడ్డి విరుగుతుంది.  ఆదుకునే నాథుడు కూడా ఉండడు.  ఈ లాక్ డౌన్ లో మగజాతి వెయ్యాల్సిన ఆసనం ఒకే ఒకటి.. అదే 'వెంకీ ఆసన్.'


Tags:    

Similar News