సినిమా షూటింగ్స్ పై క్లారిటీ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్...!

Update: 2020-07-25 15:30 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''వకీల్ సాబ్'' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు - బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మే నెలలో సమ్మర్ స్పెషల్‌ గా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్' కరోనా ప్రభావం కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో పాటు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా కరోనా కారణంగా చిత్రీకరణ నిలుపుదల చేసుకుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పై క్లారిటీ ఇచ్చేసాడు.

కాగా ఇటీవల జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే సినిమాల గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. ''కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన చిరంజీవి గారితో సహా కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కలిశారు. కానీ అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా ఇబ్బందే. ఫైనల్ గా మనోధైర్యం నింపే ఒక వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే'' అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాక్సిన్ వచ్చే వరకు సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం అయిపోయింది.
Tags:    

Similar News