పవన్ సినిమా పూజ.. నిజమేనా?

Update: 2022-06-26 02:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న, చేయబోతున్న సినిమాల విషయంలో విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఆయన సినిమాల గురించి రోజుకో రూమర్ హల్‌చల్ చేస్తోంది.

క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదు. ఆ సినిమా తాత్కాలికంగా ఆగినట్లు వార్తలొస్తున్నాయి. దీని తర్వాత చేయాల్సిన హరీష్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ విషయంలో ఎడతెగని జాప్యం నడుస్తోంది.

సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా గురించి అసలు ఊసే లేదు. ముందు అనౌన్స్ చేసిన ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదియ సిత్తం’ అనే తమిళ చిత్ర రీమేక్‌లో పవన్ నటించబోతున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు రావడం తెలిసిందే. ఇందులో సాయిధరమ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తాడని.. మార్చిలోనే సినిమా మొదలవుతుందని అప్పుడు వార్తలొచ్చాయి. కానీ అవి నిజం కాలేదు.

ఒక దశలో ఈ ప్రాజెక్టు పట్ల జనాల్లో వ్యతిరేకత చూసి దీన్ని ఆపేశారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడేమో ఈ సినిమా పక్కా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు చడీచప్పుడు లేకుండా ప్రారంభోత్సవం జరిపించేసినట్లుగా రెండు రోజులుగా రోజులుగా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో.

ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖనినే అయినా.. పవన్ మిత్రుడైన త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని.. ‘భీమ్లా నాయక్’ తరహాలో స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చి తెర వెనుక దర్శకుడిగా మారబోతున్నాడని అంటున్నారు. ఐతే పవన్ కళ్యాణ్ సినిమాకు ముహూర్త కార్యక్రమం జరిగితే చిన్న అప్‌డేట్ కూడా బయటికి రాకపోవడం, ఫొటోలు ఎక్కడా కనిపించకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది.

ఇది ఉత్తుత్తి ప్రచారమేమో అని కూడా అంటున్నారు. అలా అని పవన్ వేరే సినిమాల ముచ్చట్లు కూడా ఏమీ వినిపించడం లేదు. ‘హరిహర వీరమల్లు’ లుక్‌నే పవన్ మెయింటైన్ చేస్తుండగా.. ఆ సినిమా షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొంటున్న సూచనలేమీ కనిపించడం లేదు.
Tags:    

Similar News