ఒక్క కట్ లేకుండా సెన్సార్ క్లియర్

Update: 2017-09-12 10:34 GMT
ప్రహ్లాద్ నిహ్లాని కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవిలో ఉన్నపుడు ఎన్ని సినిమాలు ఆయన కత్తెర వేటుకు గురయ్యాయో తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమాలో కిస్ లెంగ్త్ తగ్గించడమైతేనేమి.. ఉడ్తా పంజాబ్.. బాబూ మషాయ్ బందూక్ బాజ్.. ఇందు సర్కార్ లాంటి సినిమాలకు పదుల సంఖ్యలో కట్స్ చెప్పడమైతేనేమి.. ఇంకా ఆయన హయాంలో ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి. ముద్దులు.. ఇంటిమేట్ సీన్లు.. హింసాత్మక సన్నివేశాల విషయంలో ప్రహ్లాద్ మరీ కఠినంగా వ్యవహరించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐతే అతను సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దిగిపోయిన వెంటనే.. అతడి సమర్పణలో రాబోతున్న ‘జూలీ-2’ సినిమా విడుదలకు సిద్ధమైంది.

జూలీ-2 ట్రైలర్ చూస్తేనే అందులో బూతు కంటెంట్ కు పరిమితులే లేవని అర్థమైంది. ఇలాంటి సినిమా ప్రహ్లాద్ హయాంలో సెన్సార్ కు వెళ్తే ఎన్ని కోతలు పడేవో. అసలు సర్టిఫికెట్ జారీ చేసేవాళ్లో లేదో. కానీ ఆయన దిగిపోయాక బాధ్యతలందుకున్న ప్రసూన్ జోషి నేతృత్వంలోని సెన్సార్ బోర్డు ‘జూలీ-2’కు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క కట్ చెప్పకుండా దీనికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది. తాను సెన్సార్ బోర్డు ఛైర్మన్ గా ఉన్నంత కాలం అడల్ట్ కంటెంట్ విషయంలో అంత కఠినంగా ఉన్న ప్రహ్లాద్.. ‘జూలీ-2’ లాంటి సినిమాలో ఎలా భాగస్వామి అయ్యాడో మరి. 2004లో నేహా ధూపియా కథానాయికగా తెరకెక్కిన ‘జూలీ’కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘జూలీ-2’లో లక్ష్మీరాయ్ కథానాయికగా నటించింది. ఆమెకిదే తొలి హిందీ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News