ఎట్టకేలకు పెదవి విప్పిన నిహారిక

Update: 2023-05-13 20:54 GMT
నిహారిక కొణిదెల.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటన్న విషయం తెలిసిందే. అంతలా ఈ మెగా డాటర్ తరచూ ఏదో ఒక విషయంలో హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకోబోతుందని, గర్భవతి అయిందని ఇలా ఎన్నో పర్సనల్ విషయాల వల్ల హైలైట్ అవుతోంది.

పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు బ్రేకిచ్చి.. నిర్మాతగానే వ్యవహరిస్తోన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘డెడ్ పిక్సల్’ అనే వెబ్ సిరీస్‌తో  రాబోతుంది. దీంతో ఆమె క్రేజీ రోల్ చేసినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్‌కు రాబోతుండడంతో నిహారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది.

‘డెడ్ పిక్సల్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఈ వెబ్ సిరీస్‌ గురించి, అందులో ఆమె పాత్ర గురించి చాలా వివరాలను బయట పెట్టింది. అదే సమయంలో ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు, మీమ్స్ గురించి కూడా తొలిసారి స్పందించింది.

ఈ ఇంటర్వ్యూలో నిహారిక యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నటన మీద ఆసక్తితోనే కెరీర్‌ను మొదలు పెట్టాను. సినిమా అయినా, సిరీస్ అయినా వందకు వంద శాతం ఇవ్వడానికే ప్రయత్నిస్తా’ అని చెప్పింది. ఇక, రూమర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను పెద్దగా పట్టించుకోను. ఒకప్పుడు కామెంట్లు చూసేదాన్ని. కానీ, ఇప్పుడు లైట్ తీసుకుంటున్నాను. అందులో కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. అవి చూస్తే చాలా నవ్వు వచ్చేస్తుంది’ అని వెల్లడించింది.

ఇదే ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ జట్టును కొనుగోలు చేస్తున్నాడని వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వమని యాంకర్ అడగ్గా.. నిహారిక ‘అవునా.. ఏ టీం కొంటున్నారో నాక్కూడా చెప్పండి. ఇది నాకైతే తెలీదు. మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అన్నయ్య (చరణ్)కు ఫోన్ చేసి అడగాలి’ అంటూ దీనిపై తొలిసారి స్పందించింది.

Similar News