మోదీ బ‌యోపిక్ కి లైన్ క్లియ‌ర్

Update: 2019-04-09 14:19 GMT
ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ నాయ‌కుల‌ బ‌యోపిక్ ల‌కు లేనిపోని చిక్కులు వ‌చ్చి ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌ల్లో ఉండ‌గా.. ఓటర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఈ బ‌యోపిక్ లు రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌లే రిలీజైన లక్ష్మీస్ ఎన్టీఆర్ - మ‌హానాయ‌కుడు వంటి చిత్రాల‌కు వివాదాలు త‌ప్ప‌లేదు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు పీఎం న‌రేంద్ర మోదీపై తెర‌కెక్కించిన బ‌యోపిక్ కి ఈ చిక్కులు త‌ప్ప‌డం లేదు.

ప్రధాని బ‌యోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా సుప్రీంకోర్టులో వ్యాజ్యం న‌డుస్తున్న సంగ‌తి తెల‌సిందే. ఎన్నికల ముందు బయోపిక్‌ను విడుదల చేయడానికి వీల్లేదంటూ విపక్షాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. అయితే నేడు సుప్రీం విచార‌ణ‌లో సినిమా రిలీజ్ కి అడ్డంకులు తొల‌గిపోవ‌డం విశేషం.  సినిమాకు సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ రానందున విడుదలను వాయిదా వేయలేమని సుప్రీం ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఈ బ‌యోపిక్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా? అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్‌ చూసుకుంటుందని న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానించారు.

రక్త చ‌రిత్ర ఫేం వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాని మోదీ పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా కి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సినది ప్ర‌తిప‌క్ష నాయ‌కుల గొడ‌వ‌ల‌తో నిలిచిపోయింది. ఈసీకి ఫిర్యాదు చేయ‌డం ద్వారా కాంగ్రెస్ అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగింది. తాజా తీర్పులో కోర్టు రిలీజ్ కి అనుకూలంగా తీర్పును వెలువరించింది. సినిమాకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ వస్తే ఈ నెల 11న విడుదల కానుంది... ఆ వెంట‌నే కొత్త రిలీజ్ తేదీని ప్ర‌క‌టించనున్నార‌ని తెలుస్తోంది. ఏప్రిల్ 12న మోదీ బ‌యోపిక్ రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News