50 ఏళ్లు ఇండ‌స్ట్రీకే అంకితం..71 వ‌య‌సులో.. బావురుమ‌న్న న‌టుడు!

రాకేశ్ బేడీ ప్రయాణం ఒక మధ్యతరగతి తిరుగుబాటుతో మొదలైంది. తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాల్సిన ఆయన థియేటర్ మీద మక్కువతో ఐఐటీ ప్రవేశ పరీక్షను మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చేశారు.;

Update: 2026-03-28 04:34 GMT

సినిమా రంగంలో గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొందరికి మొదటి సినిమాతోనే స్టార్‌డమ్ వస్తే.. మరికొందరికి దశాబ్దాల నిరీక్షణ తర్వాత గానీ ఆ అదృష్టం దక్కదు. తెలుగులో `30 ఇయర్స్ ఇండస్ట్రీ` పృథ్వీరాజ్ లాంటి నటులు ఎంతో కాలం వేచి చూసి గుర్తింపు తెచ్చుకున్నట్లుగానే.. బాలీవుడ్ సీనియర్ నటుడు రాకేశ్ బేడీ జీవితం కూడా ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. దాదాపు 50 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ఆయనకు 71 ఏళ్ల వయసులో `దురంధర్ 2` చిత్రంతో లభించిన స్టార్‌డమ్ చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పాకిస్తాన్ లో ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ నాయ‌కుడు జ‌మీల్ జ‌మాల్ గా అత‌డి న‌ట‌న‌, ఆహార్యానికి గొప్ప పేరు, గుర్తింపు ద‌క్కాయి.

రాకేశ్ బేడీ ప్రయాణం ఒక మధ్యతరగతి తిరుగుబాటుతో మొదలైంది. తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాల్సిన ఆయన థియేటర్ మీద మక్కువతో ఐఐటీ ప్రవేశ పరీక్షను మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చేశారు. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలనని నమ్మిన ఆయన ఎఫ్‌టీఐఐలో శిక్షణ పొంది ముంబై చేరుకున్నారు. తొలినాళ్లలో కేవలం బ్రతుకుదెరువు కోసం చేతికి వచ్చిన ప్రతి చిన్న పాత్రను.. అంటే హీరో స్నేహితుడిగానో లేదా హాస్య నటుడిగానే చేస్తూ సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు.

టెలివిజన్ రంగంలో యే జో హై జిందగీ, శ్రీమాన్ శ్రీమతి వంటి సీరియల్స్ ద్వారా కామెడీ కింగ్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే వెండితెరపై ఆయనలోని సీరియస్ నటుడిని గుర్తించింది మాత్రం దర్శకుడు ఆదిత్య ధర్. 2019లో వచ్చిన `యూరి` చిత్రంలో ఒక పాకిస్థానీ ఐఎస్ఐ ఆఫీసర్‌గా రాకేశ్ క్రమశిక్షణను చూసి ముగ్ధుడైన ఆదిత్య తన తదుపరి భారీ చిత్రంలో ఆయన కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారు. అదే `దురంధర్` చిత్రంలోని జమీల్ జమాలి అనే పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడి పాత్ర.

ఈ పాత్ర కోసం రాకేశ్ బేడీ తన దశాబ్దాల నాటి కామెడీ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. కరాచీ రాజకీయ నాయకుడి హావభావాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. ఒక స్ట్రాటజిస్ట్‌గా వెండితెరపై పరకాయ ప్రవేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.1,167 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాతో ఆయనకు లభించిన స్పందన అసాధారణం. ``నేను 49 ఏళ్లుగా పని చేస్తున్నాను.. కానీ ఇప్పుడు ఉన్నంత స్టార్‌డమ్‌ను ఎప్పుడూ అనుభవించలేదు``అంటూ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా వద్ద ఆయన బావురుమనడం ప్రతి ఒక్కరినీ కదిలించింది.

రాకేశ్ బేడీ సాధించిన ఈ విజయం ఔత్సాహిక న‌టీన‌టుల‌కు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కలలు కనడానికి లేదా విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని... నిరంతర కృషి ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని ఆయన నిరూపించారు. 71 ఏళ్ల వయసులో ఆయనను చూసి ప్రేక్షకులు కేవలం నవ్వడం లేదు... ఆయనలోని నటనా విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ``కష్టపడుతూ ఉండండి.. ఎప్పుడు దేవుడు మీకు యాక్షన్ చెబుతాడో ఎవరికి తెలుసు`` అనే ఆయన మాటలు ఎంతోమంది కళాకారులకు ఇప్పుడు స్ఫూర్తినిస్తున్నాయి.

Tags:    

Similar News