పుష్పరాజ్ అన్న గా మహేష్ బాబు ఫ్రెండ్..!

Update: 2021-08-26 02:30 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' పేరుతో డిసెంబర్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో సినిమా కావడంతో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు.

ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ నటిస్తుండగా.. అతన్ని ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నారు. అలానే అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు ధనుంజయ - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - శత్రు - యాంకర్ అనసూయ భరద్వాజ్ వంటి వారు 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో పాపులర్ యాక్టర్ అజయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

'పుష్ప' చిత్రంలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజయ్ కనిపించనున్నారు. అది కూడా పుష్పరాజ్ కు అన్న పాత్ర అని తెలుస్తోంది. అతని క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందా లేదా అందులో నెగెటివ్ షేడ్స్ ఉంటాయా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఏదేమైనా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అజయ్ కు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చే సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా, సపోర్టింగ్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అజయ్.. తెలుగు చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించారు. 'విక్రమార్కుడు' సినిమాలో మెయిన్ విలన్ గా విపరీతమైన పేరు తెచ్చుకున్న అజయ్.. 'పోకిరి' చిత్రంలో మహేష్ బాబు ఫ్రెండ్ గా అద్భుతమైన నటన కనబరిచారు. 'ఒక్కడు' సినిమా నుంచి మహేష్ నటించే ప్రతీ చిత్రంలోనూ అజయ్ కు ఓ పాత్ర ఉంటుంది. అలానే అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' 'ఆర్య 2' 'అల వైకుంఠపురములో' చిత్రాల్లో నటించిన అజయ్.. ఇప్పుడు ''పుష్ప'' చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు

'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
Tags:    

Similar News