నాగ్ .. సుకుమార్ ముఖ్య అతిథులుగా 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్!

Update: 2021-09-28 04:32 GMT
నాగ చైతన్య .. సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాను తెరకెక్కించాడు. వ్యక్తిత్వం ఉన్న హీరో .. హీరోయిన్లు తాము కలుసుకోవడానికి ముందు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాక ఎలాంటి సమస్యల్లో పడ్డారు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్ల దగ్గర మళ్లీ సందడి కనిపించింది .. మళ్లీ మునుపటి రోజులు వచ్చాయనే నమ్మకం కలిగింది ఈ సినిమాతోనేనని చెప్పొచ్చు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అథితిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వేదికపై ఆయన సాయిపల్లవి .. చైతూ నటనను ఎంతగానో ప్రశంసించారు. కొన్ని కారణాల వలన ఆ ఫంక్షన్ కి నాగార్జున రాలేకపోయారు. ఆయన రాకపోవడం అభిమానులకు చాలా వెలితిగా కూడా అనిపించింది. అందువలన ఈ రోజున జరిగే సక్సెస్  మీట్ కు చీఫ్ గెస్టుగా ఆయనను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరో ముఖ్య అతిథిగా దర్శకుడు సుకుమార్ ను కూడా ఆహ్వానించినట్టుగా సమాచారం. ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని 'Trident Hotel' ల్లో ఈ సక్సెస్ మీట్ జరగనుంది.
Read more!

మొదటి నుంచి కూడా 'లవ్ స్టోరీ' పై మంచి బజ్ ఉంది. శేఖర్ కమ్ముల ప్రేమకథలపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకమే అందుకు కారణం. 'ఆనంద్' .. 'గోదావరి' .. 'ఫిదా' వంటి సినిమాలు అందుకు ఊరంతటి ఉదాహరణ. ఆయన ప్రేమకథల్లో సున్నితత్వం ఎక్కువగా ఉంటుంది .. ఆ సున్నితత్వంలో నుంచి పుట్టే ఎమోషన్స్ బలంగా ఉంటాయి. మనసుల మధ్య జరిగే ఘర్షణ .. సంఘర్షణను ఆయన చిత్రీకరించే తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా కుటుంబంతో సహా చూడదగినవిగా ఆయన సినిమాలు ఉంటాయి. ఓవర్సీస్ లో ఆయన సినిమాలు భారీ వసూళ్లు రాబట్టడానికి కారణం ఇదే.

ఈ సారి ఆయన ప్రేమకథను కుల వివక్ష .. లింగ వివక్ష అనే అంశాల చుట్టూ అల్లుకుంటూ వెళ్లాడు. ఆ పాయింట్ ను బలంగా జనంపై రుద్దకుండా సున్నితంగా .. అందంగా చెప్పుకుంటూ వెళ్లాడు. బలమైన కథాకథనాలకి తోడు, మనసుకు పట్టుకునే పాటలు తోడయ్యాయి. ఇక సాయిపల్లవి డాన్స్ ను ఇష్టపడి వెళ్లిన ప్రేక్షకులకు మనసులకు పట్టాభిషేకమే  జరిగింది. కథలో స్థానికతతో పాటు మిగతా అన్ని అంశాలు కుదరడం వలన ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని అందుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ రోజున ఈ సినిమా సక్సెస్ మీట్లో నాగార్జున ఏం మాట్లాడతారో చూడాలి.     
Tags:    

Similar News