'ఉప్పెన' వేదికపై బంగారుబొమ్మలా మెరిసిన కృతి శెట్టి

Update: 2021-02-17 17:30 GMT
సముద్రాన్ని ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే పాత కెరటం మళ్లీ పుట్టదు .. కొత్త కెరటం ఎక్కడ పుడుతుందో ఎవరికి తెలియదు. అందువల్లనే సముద్రం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది .. ఏదో కబుర్లు చెప్పడానికి పరుగులు పెడుతూ వస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సముద్రం ఎన్నో ప్రేమకథలను చూసి ఉంటుంది .. వినేసి ఉంటుంది. అది వినిపించేది ఆ ప్రేమికుల హృదయ స్పందనగా అనిపిస్తుంది. అలాంటి ప్రేమకథను ఆ సముద్రం నేపథ్యంలో చిత్రీకరిస్తే అదే 'ఉప్పెన' అవుతుందనే విషయాన్ని దర్శకుడు 'బుచ్చిబాబు' నిరూపించాడు.

విడుదలైన ప్రతి ప్రాంతంలో 'ఉప్పెన' భారీ వసూళ్లను సాధిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' రాజమండ్రిలో ఘనంగా జరుగుతున్నాయి. చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండటంతో, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో వేదిక దగ్గరకి చేరుకున్నారు. ఆల్రెడీ వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి వేదికపై తళుక్కున మెరిశారు. నీలం - పింక్ కలర్ కాంబినేషన్లోని లంగావోణీలో కృతి శెట్టి కలర్ఫుల్ గా కనిపించింది. ఈ అమ్మాయిని దగ్గరగా చూడటానికి అభిమానులంతా ఉత్సాహాన్ని చూపించారు.

నిజంగానే ఈ మధ్యకాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మొదటిస్థానం కృతి శెట్టికి దక్కుతుంది. థియేటర్లను జనాలు ఒక 'ఉప్పెన'లా ముంచెత్తడానికి ప్రధానమైన కారణం ఈ అమ్మాయి గ్లామర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పోస్టర్లలో అమ్మాయి అందాన్ని చూసి ఆరాధకులైపోయిన వాళ్లంతా, సినిమా చూసిన తరువాత అభిమానులుగా మారిపోయి థియేటర్లలో నుంచి బయటికి వస్తున్నారు. ఈ సినిమాలో హీరోను చూసిన హీరోయిన్, 'వీడు ముసలాడవ్వకూడదే' అంటుంది. ఈ అమ్మాయిని చూసిన కుర్రాళ్లు కూడా అదే మాట అనుకుంటున్నారు .. ఆమె చూపుల తాకిడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.




Tags:    

Similar News