ఎమోషనల్ క్రికెట్ - టీజర్ రివ్యూ

Update: 2019-06-18 12:01 GMT
స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాలకు ఈ మధ్య టాలీవుడ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. దానికి ఉదాహరణగా జెర్సీని చెప్పుకోవచ్చు. అదే బాటలో వస్తున్న మరో సినిమా కౌసల్య కృష్ణమూర్తి. కోలీవుడ్ లో గత ఏడాది తమిళంలో మంచి విజయాన్ని దక్కించుకున్న కణా రీమేక్ ఇది. మెగాస్టార్ చిరంజీవి ద్వారా దీని టీజర్ ఇందాకా విడుదల చేశారు. కథలోని మెయిన్ థీమ్ ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.

అనగనగా ఓ పల్లెటూరి రైతు కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్). చేసేది వ్యవసాయమే అయినా క్రికెట్ అంటే ప్రాణం. ఆ క్రీడ తండ్రికి ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచే చూసిన కూతురు కౌసల్య(ఐశ్వర్య రాజేష్)ఎలాగైనా సరే భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి నాన్న కళ్ళలో సంతోషం చూడాలని డిసైడ్ అవుతుంది.  కృష్ణముర్తిని కౌసల్యను అందరూ ఎగతాళి చేసేవాళ్ళే. ఇది చాలక ఊళ్ళో సమస్యలు పంటల్లో నష్టాలు. స్థానిక క్రికెట్ తో మొదలుకుని జాతీయ స్థాయికి వెళ్లే క్రమంలో తండ్రి కూతుళ్ళకు ఎన్నో సవాళ్లు అవమానాలు ప్రమాదాలు. వీటికి ధీటుగా నిలబడి కౌసల్య తన తండ్రి కలను లక్ష్యాన్ని ఎలా సాధించి చూపించింది అనేదే కౌసల్య కృష్ణ మూర్తి

టీజర్ లో మంచి ఎమోషన్ నింపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడే సగటు పల్లెటూరి ఆడపిల్లగా ఐశ్వర్య రాజేష్ నటన దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. అమాయకత్వం ఆత్మవిశ్వాసం రెండు కలగలిసిన టైటిల్ రోల్ లో ఇట్టే ఒదిగినట్టు కనిపిస్తోంది. ఇక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కౌసల్య తండ్రిగా సింపుల్ గా జీవించేశారు. శివ కార్తికేయన్ చిన్న క్యామియో చేశారు. ఝాన్సీ-వెన్నెల కిషోర్-రంగస్థలం మహేష్-విష్ణు-సిఎల్వి నరసింహరావు ఇతర కీలక తారాగణం.

దిబు నినన్ థామస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఆండ్రూ ఛాయాగ్రహణంలో స్టాండర్డ్స్ బాగున్నాయి. కెఎస్ రామారావు నిర్మాణ విలువలు బ్యానర్ కు తగ్గట్టే రిచ్ గా అనిపిస్తున్నాయి. తెలుగులో ఒక విమెన్ సెంట్రిక్ స్పోర్ట్స్ డ్రామా అందులోనూ క్రికెట్ ను ఆధారంగా చేసుకుని వస్తున్న కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్ తోనే డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కలిగించింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.


Full View

Tags:    

Similar News