మ‌రో బాహుబ‌లి ట్రై చేసి చేతులెత్తేసిన‌ క‌ర‌ణ్ జోహార్!?

Update: 2021-02-04 01:30 GMT
బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి సినిమా తీయాల‌ని అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌య‌త్నాలు సాగాయి. ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతూనే ఉన్నాయి. కానీ ఎన్నో ప్ర‌య‌త్నాలు దారుణంగా విఫ‌ల‌మ‌య్యాయి. అప్ప‌ట్లో త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్.సి సంఘమిత్ర అనే భారీ పాన్ ఇండియా సినిమాని ప్రారంభించి మ‌ధ్య‌లోనే ఆపేశారు. ఇక అమీర్ - అమితాబ్ అంత‌టివాళ్లు న‌టించిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ ప్లాన్ కూడా బాహుబ‌లిని కొట్టాల‌నే. కానీ అది బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. ధ‌నుష్ - శ్రీ‌దేవి కాంబినేష‌న్ లోనూ ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. సౌత్ లో చాలా సినిమాలు పెద్ద రేంజులో మొద‌లై మిడిల్ డ్రాప్ అయ్యాయి.

ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ వంతు. బాలీవుడ్ స్టార్ ఫిలింమేక‌ర్ కరణ్ జోహార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `తఖ్త్` ని బాహుబ‌లి రేంజులోనే తెర‌కెక్కించాల‌న్న‌ది ప్లాన్. అన్న‌ద‌మ్ముల న‌డుమ సింహాస‌నం కోసం ఘ‌ర్ష‌ణ‌! అనే క్రేజీ ఎలిమెంట్ తో భారీ హిస్టారిక‌ల్ కాన్సెప్టును ఎంచుకుని ఈ సినిమాని పెద్ద రేంజులోనే ప్లాన్ చేశారు. అదిరిపోయే కాస్టింగ్ ని ఎంచుకున్నారు. రణ్‌వీర్ సింగ్- అలియా భట్ - విక్కీ కౌషల్- జాన్వీ క‌పూర్- క‌రీనా వంటి టాప్ స్టార్ల‌ను క‌ర‌ణ్ తారాగ‌ణంగా ప్ర‌క‌టించారు. కానీ  ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏదీ లేక‌పోవ‌డంతో ప‌రిశ్ర‌మ‌ల్లో సందేహం నెల‌కొంది. ఇన్నాళ్లు  COVID-19 కారణంగా ఇది ఆగిపోయింద‌ని భావించినా.. ఇప్ప‌టికీ ఉలుకూ ప‌లుకూ లేక‌పోవ‌డంతో ఆగిపోయిన‌ట్టేన‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా సంచ‌ల‌న‌ క‌థ‌నం ప్ర‌చురించింది.

తఖ్త్ చాలా కాలం నుండి వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్. ఈ పీరియడ్ డ్రామా 2020 లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా... కరోనావైరస్ వ్యాప్తి కారణంగా నిలిపివేశారు అప్ప‌టికి. ఇప్పుడు శాశ్వ‌తంగా ఒక‌ మంచి కోసం ఆపేశారంటూ క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి.

త‌ఖ్త్ ని ప‌క్క‌న పెట్టేసిన‌ కరణ్ జోహార్ దాని స్థానంలో ఒక ప్రేమ కథ కోసం పని చేస్తున్నార‌ని.. దీని కోసం అతను రణవీర్ సింగ్ - అలియా భట్ జంట‌ను మ‌రోసారి క‌లుపుతున్నాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. త‌ఖ్త్ కి క‌ర‌ణ్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించాల్సి ఉండ‌గా.. ఇప్పుడు కాన్సెప్టునే రీప్లేస్ చేస్తున్నాడ‌న్న‌ది టాక్.  రణవీర్-అలియాతో కలిసి ఈ కొత్త చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు! అన్న టాక్ వేడె‌క్కిస్తోంది.

తఖ్త్ నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం. నేను గత రెండున్నర సంవత్సరాలుగా దానిపై పని చేస్తున్నానని కరణ్ ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. కానీ ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నారెందుకు? అంటే..ఈ సినిమా క‌థాంశంలో వివాదాస్ప‌ద ఎలిమెంట్ కూడా ఒక కార‌ణ‌మ‌ని విశ్వ‌సిస్తున్నారు. ఇందులో మ‌తాల గురించిన ప్రస్థావ‌న ఉండ‌డంతో ఇది ఇప్పుడు మంచిది కాద‌ని భావించార‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. క‌ర‌ణ్ ఇస్లామోఫోబియాను ఆమోదించడంతో అత‌డిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. హిందూ మ‌నోభావాల‌తో స‌మ‌స్య త‌లెత్తింది. అందుకే త‌ఖ్త్ ని ఆపేశార‌న్న చ‌ర్చా సాగుతోంది.

అయితే ఓ ఇంట‌ర్వ్యూలో అత‌డు దీనిపై ఉఠంకిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల పట్ల నా సున్నితత్వం ఎప్పటికీ అలానే ఉంటుందని అన్నారు. ఇది మానవుడిగా ఈ గొప్ప దేశంలో పుట్టిన‌ పౌరుడిగా ఉన్నా.. సాధారణంగా ప్రపంచ పౌరుడిగా ఉండ‌టాన్ని నమ్ముతున్నాను. తఖ్త్ నేను రాసిన కథ కాదు. చరిత్ర ఈ కథను రాసింది. నేను తెర‌పై చూపిస్తున్నాను అంతే!! అని కూడా క‌ర‌ణ్ అన్నారు. కార‌ణం ఏదైనా కానీ మొత్తానికి తఖ్త్ సినిమా లేన‌ట్టేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ మీడియా క‌థ‌నాల‌పై క‌ర‌ణ్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. ఆగిపోయింద‌ని ఆయ‌నే క‌న్ఫామ్  చేసేవ‌ర‌కూ ఇది అన‌ధికారిక‌మే. ఒకవేళ ఈ సినిమా ఆగిపోయిన‌ట్ట‌యితే బాహుబ‌లి రేంజు ప్ర‌య‌త్నం అర్థాంత‌రంగా నిలిచిపోయిన‌ట్టేన‌ని టాలీవుడ్ విశ్లేష‌కులు భావిస్తారు. మ‌రి అన్నిటికీ ధ‌ర్మాధినేత క‌ర‌ణ్ స‌మాధానం చెబుతారేమో చూడాలి. క‌ర‌ణ్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే దేవ‌ర‌కొండ‌-పూరితో లైగర్ లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని క‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News