ఏందబ్బీ ఇట్టజేసినవు!

Update: 2020-09-08 08:30 GMT
జయప్రకాష్ రెడ్డి అంటే  కరడు గట్టిన ఫ్యాక్షనిజం పాత్రలే కాదు. కదిలించే సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే పాత్రలు అవలీలగా చేయగలరు. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, చెన్నకేశవ రెడ్డి  వంటి సినిమాల్లో భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా కనిపించిన జయప్రకాశ్ కిక్, కబడ్డీ కబడ్డీ సినిమాల్లో సున్నితమైన   కామెడీ చేయగలరని ఎవరూ ఊహించలేదు. ఆయన  మొదట్లో విలన్ పాత్రలకే పరిమితమైనా ఆయనకు పేరు తెచ్చింది మాత్రం సపోర్టింగ్, కామెడీ పాత్రలే. చూడటానికి కూడా రౌద్రంగా కనిపించే జయప్రకాష్ రెడ్డి ' ఎవడి గోల వాడిది' ఎవడు వంటి సినిమాల్లో భయస్తుడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడు. రాయలసీమ మాండలికంలో అంతకు ముందు ఎన్నో సినిమాలు వచ్చినా.. తెరపై ఆ మండలికానికి పేరు తెచ్చింది జయ ప్రకాష్ రెడ్డే.

నిజంగా ఆయనో విలక్షణ నటుడు, ఆయన యాస, భాష అన్నీ ప్రత్యేకమే. తెలుగు సినీ చరిత్రలో బహుశా ఇటువంటి నటుడిని ఊహించడం కష్టమే. ఇప్పుడు ఆయన మన నుంచి దూరంగా వెళ్లిపోయాడంటే తెలుగు సినీలోకమే కాదు.. అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఆయన పాత్రలన్నీ అలా కండ్లముందు కదలాడుతున్నాయి. ఆయనే తుర్పు జయప్రకాశ్​రెడ్డి. ఇవాళ ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారన్న వార్త పలువురు అభిమానుల్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన చేసిన పాత్రలు గుర్తుకు తెచ్చకుంటుంటే.. ఆయన నటిస్తున్నట్టు అనిపించదు. మన ఇంట్లో బాబాయో.. మామో, తాతయ్యో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది నెల్లూరు యాసనై, తెలంగాణ భాషనా..  కర్నూల్​ మాండలకమైనా ఆయన నోటినుంచి వచ్చిందంటే సహజత్వం ఉట్టిపడుతుంది. తండ్రి పాత్రైనా, పెదనాన్న పాత్రైనా, విలన్​ పాత్రైనా ఆయన ఎంట్రీ ఇచ్చాడంటే హాల్​ అంతా అరుపులతో దద్దరిల్లిపోయోది. నాటకరంగం నుంచి వచ్చిన జయప్రకాశ్​రెడ్డి మరణంతో పలువురు రంగస్థల నటులు కూడా సంతాపం తెలిపారు. నల్లగొండలో ఆయన ప్రదర్శించిన గప్​చుప్​ అనే నాటకం చూసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆయనకు సినిమాలో అవకాశం కల్పించారు.
Read more!


అనిల్​ రావిపుడి పిలిస్తే.. మళ్లీ వచ్చాడు..

గత ఏడాది ఏప్రిల్​లోనే జయప్రకాశ్​రెడ్డి సినిమాలకు గుడ్​బై చెప్పాడు. అప్పటికీ ఆయనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎందుకో విరమిద్దామనుకున్నాడు. హైదరాబాద్​ను వదిలి గుంటూరు వెళ్లిపోయారు. అక్కడే కుమారుడి వద్ద ఉంటున్నారు. అయితే సరిలేరు నికెవ్వరూ డైరెక్టర్​ అనిల్ రావిపుడితో.. జయప్రకాశ్​రెడ్డికి సత్సంబంధాలు ఉండేవి.. ఆయన ఎప్పుడూ బాబాయ్​ అని పిలిచేవారు. ఎలాగైనా తన సినిమాలో జయప్రకాశ్​రెడ్డిని పెడుదామనుకున్నారు. అందుకే ఆయన ఇంటికి వెళ్లి ఒప్పించి మరీ సరిలేరు నీకెవరూ సినిమా కోసం తీసుకొచ్చారట. ఇదే ఆయన చివరి సినిమా అయ్యింది. ఆ సినిమాలో రెండే డైలాగ్​లు ఉంటాయి..  ఫస్టాఫ్ అంతా ‘పండబెట్టి-పీక కోసి’ అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా ‘కూజాలు చెంబులౌతాయి’ అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు డైలాగ్​ లో ఆ సినిమాలో ఓ రేంజ్​లో క్లిక్​ అయ్యాయి.


ఉపాధ్యాయుడి నుంచి రంగస్థలం వయా సినీరంగం

గుంటూరు జిల్లాలో జయప్రకాశ్​రెడ్డి చాలాకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రస్తుత మంత్రి నక్కా ఆనందబాబు ఆయన శిష్యుడే.. తన గురువుగారి మృతికి ఆనందబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి సినీరంగానికి, నాటకరంగానికి తీరని లోటని పేర్కొన్నారు. జేపీ భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రకాశ్​రెడ్డి, కూతురు విపులను ఆయన ఫోన్​చేసి ఓదార్చారు.

అన్ని మండలికాలపై పట్టు.. ఎలా వచ్చిందంటే..
4
 
జయప్రకాశ్​రెడ్డి కర్నూల్​ జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరువెళ్ల గ్రామంలో 1946 మే 8న జన్మించారు. ఆయన తండ్రి సబ్​ఇన్​స్పెక్టర్​గా పనిచేసేవారు. అయితే జేపీ విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే సాగింది. అందుకే ఆయన నెల్లూరు మాండలికంపై అంత పట్టు.  నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. అనంతపురంలోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే.

సినీ రంగ పరిచయము

ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. కానీ 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు.
Tags:    

Similar News