కులాల కుళ్లు మాటలేంది జేసీ?

Update: 2017-01-23 13:33 GMT
నచ్చనోళ్ల మీదనే కాదు.. నచ్చినోళ్ల మీదన కూడా నోరు పారేసుకోవటం అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అలవాటు. అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. మీడియాలోకి రావటం ఆయనకీ మధ్యన ఎక్కువైంది. సొంత పార్టీ అధినేతపైనే సంచలన వ్యాఖ్యలు చేయటం.. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం ఏదో రకంగా విపక్ష నేత వైఎస్ జగన్ ను ఉద్దేశించిన పనికిమాలిన వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన ఆయనకో అలవాటుగా మారింది.

ఓపక్క సుప్రీంకోర్టు కులాలు.. మతాలతో ఓట్లు అడగటం.. రాజకీయం లాంటివి చేయొద్దంటే.. జేసీ అలాంటి వాటిని వదిలేసి.. మనసులోని కుళ్లును కులాలకు అపాదిస్తూ రాజకీయ లబ్థి పొందాలన్నట్లుగా కనిపిస్తోంది. జగన్ పై విమర్శలు చేయటం ద్వారా.. అధినేత మనసును గెలుచుకోవటంతో పాటు.. ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలన్నట్లుగా జేసీ తీరు ఉందని చెప్పాలి.

అవసరం ఉన్నా లేకున్నా ఏదో రూపంలో జగన్ ప్రస్తావన తీసుకొచ్చే జేసీ.. తాజాగా తనదైన రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలోని నల్లమాడలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న జేసీ.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు దమ్ముంటే తాను రెడ్డినని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను రెడ్డినని చెప్పుకుంటున్నా.. ఇతర కులాలు.. మతాల్లోని వారి పట్ల ఎలాంటి ద్వేషం లేదన్నారు. రెడ్డి కులస్తులు ఎవరైనా సాయం కోరివస్తే కాదనకుండా సాయమందించే భావన తనలో ఉందంటూ అసలుసిసలు కుల నాయకుడిగా మాట్లాడారు.

జేసీ మాటల్నే తీసుకుందాం. ఎన్టీఆర్ తనకు తాను కమ్మవాడినని చెప్పుకుంటారు. నేను కమ్మవాడ్ని అని సగర్వంగా చాటుకున్నారా?అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్టీఆర్ అందరివాడు. ఆయన ఏ కులానికో.. ప్రాంతానికో పరిమితమైనోడు. జేసీ లాంటి నియోజకవర్గ నేతలు.. కుల చట్రంలో ఇరుక్కుపోయి అందులోని నుంచి బయటకు రారు. జగన్ లాంటోళ్లు తాము ఫలానా కులానికే పరిమితం కావాలని అస్సలు కోరుకోరన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందరిని సమానంగా చూడటం.. అందరికి సాయంగా ఉండటం నాయకుడు అన్న వాడికి కావాల్సింది. తాను రెడ్డినని గొప్పగా చెప్పుకుంటూ.. రెడ్లకు సాయం చేస్తానని చెప్పే జేసీ లాంటి వారు.. రెడ్ల ఓట్లతో మాత్రమే గెలిచారా? అన్న ప్రశ్నను అంతరాత్మకు వేసుకుంటే మంచిది. కులాలు.. మతాలు..వర్గాలకు అతీతంగా ఆలోచించాల్సిన వయసులోనూ.. అదేకుల చట్రంలో చిక్కుకుపోయి.. తన కంటికి కనిపించినోళ్లందరూ అలానే ఉండాలని కోరుకోవటం ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. వయసు పెరుగుతున్న జేసీకి ఇలాంటి చిన్న విషయాలు కూడా చెప్పాల్సి రావటమే అసలుసిసలు విషాదమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News