OTT వార్ లోకి మీడియా దిగ్గ‌జం రామోజీరావు!

Update: 2020-09-16 06:15 GMT
ప‌చ్చ‌ళ్ల వ్యాపారంతో మొద‌లు పెట్టి ఎంట‌ర్ ప్రైన్యూర్ గా మీడియా దిగ్గ‌జంగా ఎదిగారు రామోజీ రావు. ఈనాడు ఈటీవీ గ్రూప్ సంస్థ‌ల అధినేత‌గా ఆయ‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ఉంది. వ్యాపారం ప‌రంగా ఆయ‌న చేప‌ట్టింద‌ల్లా బంగార‌మేన‌ని చెబుతారు.

సినీనిర్మాత‌గానూ రామోజీరావు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తెర‌కెక్కించారు. ఉషా కిర‌ణ్ మూవీస్ లో దాదాపు 80 పైగా సినిమాలు తీసారు. ఇక ఇవ‌న్నీ 99ఏళ్ల పాటు కేవ‌లం ఈటీవీలోనే చూసే భాగ్యం ఆడియెన్ కి ఉందిట‌. ఇక సినీరంగంలో ఆయ‌న స్పీడ్ త‌గ్గించారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ హ‌వా సాగుతోంది కాబ‌ట్టి ఓటీటీ రంగంపైనా రామోజీ క‌న్ను ప‌డింద‌న్న‌ది తాజా స‌మాచారం.

ఇప్ప‌టికే తెలుగులో ఆహా ఓటీటీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అల్లు అర‌వింద్ అండ్ కో ఆహా కోసం కోట్లాది రూపాయ‌లు వెద‌జ‌ల్లుతూ ఓటీటీ కంటెంట్ ని అందిస్తున్నారు. లాంగ్ టైమ్ లో భారీ లాభాల్ని ఆర్జించేందుకు ప్ర‌ణాళిక‌లతో దూసుకెళుతున్నారు. అర‌వింద్ స్ఫూర్తితో ప‌లువురు టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు ఓటీటీపై క‌న్నేశార‌న్న టాక్ ఉంది. అందుకే ఇప్పుడు రామోజీ రావు కూడా ఈ విభాగంలో రాణించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఎలానూ ఈటీవీ సినిమాల ద‌న్ను ఉంటుంది కాబ‌ట్టి అవ‌న్నీ అనుబంధ ఓటీటీలో వీక్షించే వీలుంటుంది. ఇక జెమిని - స‌న్ నెక్ట్స్ లా.. జీ టీవీ - జీ నెట్ వ‌ర్క్ లా .. ఈటీవీ ఓటీటీ కూడా రెడీ అవుతుంద‌నే భావిస్తున్నారు. ఇక రామోజీ ఓటీటీ రంగంలో ప్ర‌వేశిస్తే ఈటీవీలోనూ ఇక‌పై పెద్ద సినిమాలు వేసే వీలుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తొలిగా టీవీ ప్రీమియ‌ర్ వేసేసి అటుపై ఓటీటీలోకి దానిని పంపిస్తార‌ట‌. ఇప్ప‌టికే ఓటీటీ ప‌ని మొద‌లెట్టార‌ని తెలుస్తోంది.

అయితే ఇటీవ‌ల ఇటు తెలంగాణ‌‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం.. అటు ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో రామోజీ దోబూచులాట‌ గురించి తెలిసిందే. ఈనాడు ఈటీవీ సంస్థ‌లకు ప్ర‌క‌ట‌న‌ల‌ ఆదాయం త‌గ్గ‌డంతో అత‌డు ఇలా కొత్త దారులు వెతుకుతున్నార‌న్న కామెంట్లు కూడా ఓ సెక్ష‌న్ లో వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News