చరణ్ పాత్రను తగ్గించడం నా వల్ల కాలేదు

Update: 2022-04-28 08:30 GMT
చూడటానికి కొరటాల చాలా కూల్ గా కనిపిస్తారు. చాలా తక్కువగా మాట్లాడతారు .. ఎక్కువగా పని చేస్తారు. ఆయన నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి సినిమా హిట్. ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్. కథాకథనాలను తయారు చేసుకునే తీరు .. పాత్రలను మలిచే పద్ధతి .. మాటలు రాసుకునే విధానం .. పాటలను ప్రవేశపెట్టే పద్ధతి ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

 ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ .. "ముందుగా చరణ్ గారితో ఒక కథను అనుకున్నాను. కానీ అప్పుడు ఆయన 'ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టులో చాలా బిజీగా ఉన్నారు. దాంతో మరో కథతో  చిరంజీవిగారితో చేయాలనుకున్నాను.  ఆయన ఓకే అనడంతో మరో కథను  రెడీ చేసుకోవడం మొదలుపెట్టాను. రాస్తూ వెళుతున్నా కొద్దీ ఇందులోని సిద్ధు పాత్ర చాలా పవర్ఫుల్ గా వచ్చింది. ఈ పాత్రను చరణ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అలా ఈ కథలోకి కూడా చరణ్ వచ్చాడు.
Read more!

ముందుగా చిన్నదిగా మొదలైన సిద్ధు పాత్ర, క్రమంగా పెరుగుతూ పోవడం మొదలైంది. కావాలని నేను పెంచడం లేదు .. కానీ ఆ పాత్ర పరిధి అంతటితో ఆగడం లేదు. సిద్ధ పాత్రను తగ్గిద్దామనుకున్నా తగ్గించలేకపోయాను.

సిద్ధ పాత్రపై ప్రేమ  పెంచుకోకుండా ఎంతవరకూ రాయాలో అంతవరకూ మాత్రమే రాయాలని నిర్ణయించుకున్నాను. అలా రాస్తేనే ఆ పాత్ర అంతగా హైలైట్ అయింది. చిరంజీవిగారి పక్కన .. ఆయన పాత్రతో సమానమైన పాత్రను ఎవరు చేయగలరు? అనుకున్నాను.

  'ధర్మస్థలి' .. ఓ  గురుకులం .. ఆచార్య .. ఓ శిష్యుడు .. అనుకున్నప్పుడు నా కళ్ల ముందు చరణ్ మాత్రమే కనిపించాడు. నా ఫోన్ లో చరణ్ నెంబర్ ను కూడా నేను 'సిద్ధ' పేరుతోనే ఫీడ్ చేసుకున్నాను. అంతగా ఆ పాత్రకి ఆయన సెట్ అవుతాడని నాకు అనిపించింది.

అదే మాటను చిరంజీవి గారికి చెప్పాను. అప్పుడు ఆయన వద్దనీ అనలేదు .. అలాగని చరణ్ వైపు మొగ్గుచూపలేదు. చరణ్ దగ్గరికి వెళ్లి కథ ..  పాత్ర చెప్పి  ఆయన ఏమంటాడో చూడమని చెప్పారు. అలా ఈ కథ చరణ్ దగ్గరికి వెళ్లింది" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News