'సైరా' స్టార్ పై 'వార్' స్టార్ కామెంట్

Update: 2019-08-29 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళ వెర్ష‌న్ల‌కు ధీటుగా హిందీ వెర్ష‌న్ ని అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి బాహుబ‌లి స్ట్రాట‌జీని అనుస‌రిస్తూ ప్ర‌చారం చేస్తుండ‌డంతో అటు ముంబై మీడియాలోనూ దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన `సైరా` టీజ‌ర్- మేకింగ్ వీడియోల‌కు బాలీవుడ్ మీడియా స‌హా అక్క‌డ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అంతా బాగానే ఉంది కానీ.. సైరాకు బాలీవుడ్ లో ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర‌వుతుండ‌డంపైనా అభిమానులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. అక్క‌డ కండ‌ల హీరోలు హృతిక్ రోష‌న్ - టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం `వార్` .. అదేరోజు రిలీజ‌వుతోంది. దీంతో ఇరు  సినిమాల మ‌ధ్య బాక్సాఫీస్ వార్ త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ `వార్` ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. ఈ టైమ్ లోనే హృతిక్ పాత ఇంట‌ర్వ్యూ ఒక‌టి సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తిత్వంపై హృతిక్ ప్ర‌శంస‌లు కురిపించారు.

హృతిక్ మాట్లాడుతూ..``చిరంజీవి గారిని నా లైఫ్ లో  ఎన్నోసార్లు క‌లిశాను. ఆయ‌నో పెద్ద స్టార్. స్టార్ డ‌మ్ ని మించి మాన‌వ‌త‌.. గొప్ప స్నేహ‌స్వ‌భావం ఉన్న న‌టుడు. ఒక‌సారి ఐఫా వేడుక‌ల్లో నేను స్వ‌యంగా ఓ పార్టీ ఇచ్చాను. ఆ పార్టీకి చిరంజీవి గారు హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. పార్టీకి వ‌చ్చిన‌ అతిధులకు ఆయ‌నే వడ్డ‌న‌లు చేశారు. విన‌య‌విధేయ‌త‌ల్లోనే కాదు.. గౌర‌వం ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణిలోనూ చిరంజీవిగారు స్ఫూర్తి. ఇత‌రుల‌పై ఆయ‌న‌ చూపించే ప్రేమ న‌న్ను ఎంత‌గానో హ‌త్తుకుంది`` అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.


Tags:    

Similar News