'మీర్జాపూర్ 2' వెబ్ సిరీస్ ఎలా ఉందంటే...!

Update: 2020-10-28 06:50 GMT
వెబ్ వరల్డ్ లో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రైమ్‌ - థ్రిల్లర్‌ - యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే 'బాహుబలి' రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ కి కటౌట్స్ వెలిసాయి. పంకజ్ త్రిపాఠి - అలీ ఫజల్‌ - శ్వేత త్రిపాఠి - దివ్యేందు శర్మ - హర్షితా శేఖర్‌ - రసిక దుగల్ - కుల్భూషణ్ ఖర్బండా లు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లో ఈ సిరీస్ ఆదరణ దక్కించుకుంది. అందుకే ఈ సిరీస్‌ కు కొనసాగింపుగా 'మీర్జాపూర్‌ 2' ను రూపొందించారు. ప్రేక్షకులు దాదాపు రెండేళ్ల నుంచి సీజన్‌ 2 కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 23న 'మీర్జాపూర్‌ 2' సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి పెట్టారు.

'మీర్జాపూర్‌' మొదటి సీజన్ లో అఖండానంద్ త్రిపాఠి అలియాస్ కలీన్ భయ్యా ఆధిపత్యం నుంచి మొదలై గుడ్డు(అలీ ఫజల్‌) సోదరుడు బబ్లూ పండిట్(విక్రాంత్‌) మరియు భార్య శ్వేత(శ్రియ పిల్గోంకర్‌)లను మున్నా భాయ్(దివ్యేందు శర్మ) చంపేసే వరకు చూపించారు. ఇప్పుడు 'మీర్జాపూర్‌ 2' గుడ్డు మరియు గోలు (శ్వేత సోదరి) ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే కోణంలో సీజన్ 1 కు మించిన భావోద్వేగాలు, అశ్లీలత మరియు రక్తపాతం హింసతో తెరకెక్కింది. ముఖ్యంగా మీర్జాపూర్ 2లో బలమైన స్త్రీ పాత్రలు క్రియేట్ చేయబడ్డాయి. సాధారణ మహిళలుగా కాకుండా శక్తివంతమైన మహిళలుగా.. ఎత్తుకు పైఎత్తు వేసే పాత్రలలో చూపించారు. అక్కను చంపిన వారిపై ప్రతీకారం తీసుకోవాలనుకునే గోలు(శ్వేత త్రిపాఠి).. వితంతువైన ముఖ్యమంత్రి కుమార్తె మాధురి('గుండెజారి గల్లంతయ్యిందే' ఫేమ్ ఇషా తల్వార్) వంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మహిళలు పితృస్వామ్య వ్యవస్థ నుండి ఎలా విముక్తి పొందారో ఈ సిరీస్ లో చూపించారు. అలానే ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు ఎలాంటి పన్నాగాలు పన్నారు.. వాటి పర్యవసానాలు ఏంటనేది కూడా చూపించారు.

అంతేకాకుండా ఓటీటీ ఆడియన్స్ ని ఆకర్షించే డైలాగ్స్.. సన్నివేశాలు ఈ సీజన్ లో కూడా ఉన్నాయి. అలీ ఫజల్ ఈ సీజన్‌ లో వికలాంగ రూపంతో పాటు భయంకరమైన గెటప్ లో కనిపించాడు. ఈ సిరీస్‌ లో మొదటి సీజన్ లోని నటీనటులతో పాటు విజయ్ వర్మ - ఇషా తల్వార్ - అమిత్ సియాల్ - అంజుమ్ శర్మ మరియు మరి కొందరు నటులు కొత్తగా కనిపించారు. ఈ సీజన్ లో ఫైనల్ గా మీర్జాపూర్‌ సింహాసనంపై ఎవరు కూర్చుంటారనేది చూపించారు. అలానే సీజన్ 3 ఉండే అవకాశం కూడా ఉందని హింట్ ఇచ్చారు. కాకపోతే ఈసారి సీజన్ 2 తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇంకా ప్రేక్షకులకు అందుబాటులోకి రాలేదు. కాగా పునీత్ కృష్ణ క్రియేట్ చేసిన 'మీర్జాపూర్‌' వెబ్ సిరీస్‌ కు గుర్మీత్‌ సింగ్‌ మరియు మిహిర్‌ దేశాయ్‌ లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై రితేశ్‌ సిద్వానీ - ఫర్హాన్ అక్తర్ నిర్మించారు.

ఇదిలా ఉండగా 'మీర్జాపూర్‌ 2' వెబ్‌ సిరీస్‌ ను బ్యాన్‌ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని.. మీర్జాపూర్ ప్రాంతాన్ని ఓ హింసాత్మక ప్రదేశంగా తప్పుగా చూపించారని.. అందుకే ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలని ఎంపీ అప్నాదళ్ - ఎంపీ అనుప్రియ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ - యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌ నాయకత్వంలో మీర్జాపూర్‌ ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉందని.. వెబ్‌ సిరీస్‌ విషయంపై తప్పక విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Tags:    

Similar News