ఏవండీ ఇదేమైనా బావుందా?

Update: 2017-01-10 12:48 GMT
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి.. ఈ నెల 12న థియేటర్లలోకి వస్తోంది. చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను నుంచి మినహాయింపును ఇచ్చాయి. మొదట తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఈ ట్యాక్స్ నుంచి రాయితీ కల్పించాయి. దీనికి సంతోషం తెలుపుతూ.. గతేడాది తాను రూపొందంచిన రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయింపు కోరిన విషయాన్ని గుర్తు చేశాడు దర్శక నిర్మాత గుణ శేఖర్.

దక్షిణపథాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మహిళలగా ఘనకీర్తిని సాధించిన రుద్రమదేవి జీవితాన్ని స్వీయ నిర్మాణంలో తెరపైకి తెచ్చిన గుణశేఖర్.. ఏపీ ప్రభుత్వానికి గతంలో చేసిన విజ్ఞప్తిని గుర్తు చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాడు. '13వ శతాబ్దంలో స్త్రీ సాధికారితను చాటిన మహిళ గురించిన చారిత్రక చిత్రానికి పన్ను మినహాయింపు కోరాను. ఈ ఆదర్శవంతమైన కథకు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పన్ను మినహాయింపు ఇచ్చింది. అయితే.. ఏపీ అధికారులు మాత్రం.. నా అభ్యర్ధనను మన్నించలేదు. తాజాగా మీరు కూడా రుద్రమదేవి దక్షిణాదికే ఖ్యాతిని ఆపాదించిందని చెప్పారు' అంటూ లేఖ రాశాడు గుణశేఖర్.

అప్పటి నా దరఖాస్తును తిరిగి పరిశీలించి.. రుద్రమదేవి చిత్రానికి ఏపీలో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సరిసమానంగా ప్రోత్సాహక నగదును తనకు ఇప్పిస్తే.. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పని చేస్తోందని అందరూ భావిస్తారంటే మెలిక పెట్టాడు ఈ దర్శకుడు. మరి 30ఏళ్ల తర్వాత తెలుగులో రూపొందిన తొలి చారిత్రక చిత్రంగా ఖ్యాతి గడించిన రుద్రమదేవి విషయంలో.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News