ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు 'గంగూబాబు'

Update: 2021-12-16 16:30 GMT
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ తెరకెక్కించిన చిత్రం ''గంగూబాయి కతియావాడి''. ఇందులో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ.. 72వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడటానికి ఎంపిక చేయబడింది. ఫిబ్రవరిలో జరిగే ఈ ఫెస్టివల్‌ లో వరల్డ్ ప్రీమియర్ గా 'గంగూబాయి' స్క్రీనింగ్ చేయబడుతుంది.

ఫిల్మ్ ఫెస్టివల్‌ లోని బెర్లినాలే స్పెషల్‌ విభాగంలో 'గంగూబాయి కతియావాడి' చిత్రాన్ని ప్రదర్శించడానికి ఎంపిక చేశారు. పాండమిక్ సమయంలో చిత్రీకరించబడిన సినిమాలని ఈ సంవత్సరం ఎంపిక చేసారని తెలుస్తోంది. గత 25 ఏళ్ళుగా సినీ రంగంలో సేవలు అందిస్తున్న సంజయ్ లీలా బన్సాలీకి 'గంగూబాయి కతియావాడి' 10వ చిత్రం. అలాంటి సినిమా ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక కావడంతో ఆయన కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలవనుంది.

ఈ సందర్భంగా సంజయ్ లీలా బన్సాలీ మాట్లాడుతూ.. “గంగూబాయి కతియావాడి కథ నా హృదయానికి చాలా దగ్గరైంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు నేను మా బృందం అంతా ఎన్ని చేయాలో అన్ని చేశాం. ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో మా చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల మేము గర్విస్తున్నాము'' అని అన్నారు.

పెన్ స్టూడియోస్ నిర్మాత జయంతి లాల్ గడా మాట్లాడుతూ.. “నేను బన్సాలీని అతని నైపుణ్యాన్ని నమ్ముతాను. మా చిత్రం బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించబడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. భన్సాలీతో అనుబంధం కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈ సినిమాలో అలియా అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ ప్రాజెక్ట్‌ లో భాగమైనందుకు అజయ్ దేవగన్‌ కి ధన్యవాదాలు. ఇది ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ" అని అన్నారు.

బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ కార్లో చాట్రియన్ మాట్లాడుతూ.. “గంగుబాయి కతియావాడిని ప్రీమియర్ చేస్తుండటం.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సంప్రదాయాన్ని భారతీయ సినిమాలకు స్పెషల్ సెట్టింగ్‌ గా కొనసాగించడం మాకు సంతోషంగా ఉంది. అసాధారణమైన పరిస్థితుల్లోకి లాగబడిన గంగూబాయి అనే ఒక అసాధారణమైన స్త్రీ కథను ఇందులో చెప్పబడింది" అని అన్నారు.

కాగా, ''గంగుబాయి కథియావాడి'' చిత్రాన్ని హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా బన్సాలీ తెరకెక్కించారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడా నిర్మించారు. అప్పుడెప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా.. అనేక వాయిదాల అనంతరం 2022 ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీ మరియు తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags:    

Similar News