సర్కార్ గొడవ పెద్దదయ్యేలా ఉందే..

Update: 2018-11-09 09:36 GMT
విజయ్-మురుగదాస్‌ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. వివాదాల్లో చిక్కున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ పాత్ర పేరును మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరైన కోమలవల్లి అని పెట్టడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీంతో పాటు అధికార అన్నాడీఎంకే పార్టీ మీద పెద్ద ఎత్తున సెటైర్లు పడ్డాయి. అలాగని వేరే పార్టీల్ని కూడా వదల్లేదు. తమిళనాట రాజకీయాల్లో మార్పు రావాలన్న ఉద్దేశాన్ని గట్టిగా చాటి చెప్పేలా ఇందులో చాలా డైలాగులున్నాయి. ఇవి ప్రధాన రాజకీయ పక్షాలకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ‘సర్కార్’లోంచి కొన్ని డైలాగులు తొలగించాలని ఆందోళనలు మొదలయ్యాయి. పోస్టర్లు చించేస్తూ థియేటర్ల మీద దాడులు చేస్తున్నారు.

మరోవైపు చిత్ర దర్శకుడు మురుగదాస్‌ ను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కలకలం రేపాయి. నిన్న అర్ధరాత్రి మురుగదాస్ ఇంట్లో లేని సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టడంపై హైడ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో మురుగదాస్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో వివాదాస్పద డైలాగులుంటే ఏకంగా దర్శకుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడమేంటని సినీ పరిశ్రమ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పరిస్థితిని బట్టి చూస్తుంటే వివాదం పెద్దదయ్యేలాగే కనిపిస్తోంది. ఐతే చిత్ర బృందానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తుండటంతో ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందా అని చూస్తున్నారు. ఇది సినీ పరిశ్రమ వెర్సస్ రాజకీయ నాయకుల గొడవలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    

Tags:    

Similar News