కంగ‌నాతో ఒప్పందాలు ర‌ద్దు చేసుకుంటున్న కంపెనీలు!

Update: 2021-02-06 07:10 GMT
చాలా మందికి అర్థం కాదుకానీ.. ఫేమస్ అయిపోవడానికి కొందరు ఎంచుకునే షార్ట్  కట్ మార్గం ‘వివాదం!’ కాంట్ర‌వ‌ర్సీ వ్య‌వ‌హార శైలి ద్వారా నిత్యం వార్త‌ల్లో నిల‌వొచ్చు.. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా నిల‌వొచ్చ‌ని కొంద‌రు వివాదాల బాట‌లో న‌డుస్తుంటారు. ముఖ్యంగా.. సినీ పరిశ్రమలోని వారు ఈ విష‌యంలో రెండు ఆకులు ఎక్కువే చ‌దివి ఉంటారు. అయితే.. చివ‌ర‌కు చాలా మంది విష‌యంలో చేతులు కాలుతుంటాయి!

ఈ కోవలో ముందు వరసలో ఉండే.. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆమె వాంటెడ్ గా వివాదాల్లో త‌ల దూరుస్తారో.. వివాదాలే ఆమెను వెతుక్కుంటూ వ‌స్తాయో తెలియ‌దు కానీ.. ఎప్పుడూ వివాదాస్ప‌ద విష‌యాల్లోనే ఉంటారు ఆమె. ఆ విధంగా.. వివాదాస్ప‌ద న‌టి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు కంగ‌నా. సోష‌ల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. గ‌తేడాది మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరినప్పటి నుండి ఇది మ‌రింత ఎక్కువైంది.

ఆమె చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, వ్యాఖ్య‌లు.. చాలా వ‌ర‌కు వివాదాస్పదంగానే ఉంటుంటాయి. ఈ కార‌ణంతో ఆమె త‌ర‌చూ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు. త‌న వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న ద్వారా తాజాగా.. ఎదురైన స‌మ‌స్య‌ను వివ‌రించారు కంగ‌నా. తాజాగా.. రైతుల విష‌యంలో ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు కోసం 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులంతా.. ఉగ్ర‌వాదులే అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రైతుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న వారిపైనా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పందంగా మా‌ర‌డంతో.. త‌న‌తో ఒప్పందం చేసుకున్న బ్రాండ్లన్నీ.. అగ్రిమెంట్ల‌ను రద్దు చేసుకున్నాయ‌ని చెప్పారు కంగ‌నా. ‘నేను గొప్ప చెప్పుకోవటానికి కాదు.. ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు, ఐటెమ్ నంబర్లు, షోలు చేయను. పెద్ద హీరోల సినిమాల్లో నటించను. అయితే.. ఇప్పుడు మిగిలిన బ్రాండ్లు కూడా నా కాంట్రాక్టులు రద్దు చేశాయి. అయినప్పటికీ.. నేను తక్కువ సంపాదించినా, ప్రతిఫలం ఎక్కువే”అని రాసుకొచ్చారు కంగనా.
Tags:    

Similar News