సినిమా టికెట్ రేట్ల వ్యవహారం.. రంగంలోకి దిగిన చిరంజీవి..!

Update: 2021-12-25 10:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒక చోట టికెట్ రేట్లు తగ్గిస్తుంటే.. మరొక చోట ధరలు పెంచడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ జీవో జారీ చేయగా.. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

తెలంగాణ సర్కారు నిర్ణయంపై టాలీవుడ్ లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇది సినిమా థియేటర్ల మనుగడకు.. సినిమా మీద బతికే వేలాదిమంది కార్మికులకు.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపు విషయంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ మద్దతుతో చిరంజీవి టికెట్ రేట్ల వ్యవహారంలో చొరవ తీసుకున్నారు. సంతోష్ కుమార్ తో సహా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి మాట్లాడారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా మెగాస్టార్ కృషి చేసారు.

చిరంజీవి విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయం మీద చర్చలు జరిపి.. ఇప్పుడు ధరలు పెంచుకోడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల వ్యవహారంలో మెగాస్టార్ చొరవ తీసుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట.

టికెట్ ధరల తగ్గింపు సమస్యలపై ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని తో మాట్లాడుతున్న చిరంజీవి.. అవకాశం దొరికితే సీఎం జగన్మోహన్ రెడ్డితో విన్నవించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చిరు చొరవతో ఏపీ ప్రభుత్వం నుంచి త్వరలో టికెట్ రేట్ల వ్యవహారంలో సానుకూల స్పందన ఆశించవచ్చు.

ఏదేమైనా గత ముప్పై ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఇండస్ట్రీ అభివృద్ధికి తన వంతు కృషి చేయడం ప్రశంసనీయమనే చెప్పాలి. టికెట్ ధరల అంశంపై చొరవ తీసుకొని.. ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఇండస్ట్రీ బాగోగులు చూసే పెద్దగా వ్యవహరిస్తున్నారనే అనుకోవాలి.

ఇకపోతే సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ''తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి.. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం, అన్ని వర్గాలవారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. ఇది సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం'' అని చిరు పేర్కొన్నారు.

''పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్థం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఇండస్ట్రీ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు'' అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

చిరంజీవి ట్వీట్ కు స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ''థాంక్యూ చిరంజీవి గారూ. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. గౌరవనీయులైన సీఎం శ్రీ కేసీఆర్ గారి సమర్ధవంతమైన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల సంక్షేమానికి ఎల్లవేళలా సహకరిస్తుంది'' అని ట్వీట్ చేశారు.

అలానే రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేస్తూ.. ''మీ మంచి మాటలకు ధన్యవాదాలు చిరంజీవి గారు. ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరించడం నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. అసలైన సమస్యా పరిష్కర్త మన గౌరవ తెలంగాణ సీఎం.. లెజెండ్ శ్రీ కేసీఆర్ గారు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సీఎం సార్‌ కి చాలా రుణపడి ఉంటాం'' అని పేర్కొన్నారు.


Tags:    

Similar News