ఎవరిని రానివ్వడం లేదు-పెద్దాయన మాట

Update: 2018-01-17 17:30 GMT
సీనియర్ నటులు చంద్రమోహన్ గారి గురించి తెలియని సినిమా ప్రేమికుడు ఉండడు. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేయని పాత్ర లేదు అంటే అతిశయోక్తి కాదు. సిరిసిరిమువ్వ, పదహారేళ్ళ వయసు లాంటి సినిమాల్లో వైకల్యం ఉన్నవాడిగా నటిస్తూనే మరోవైపు జంధ్యాల గారి సినిమాల్లో పొట్ట చెక్కలయ్యే హాస్య పాత్రల్లో మెప్పించడం ఆయనకే చెల్లింది. అందుకే ఆయనంటే పరిశ్రమలో అందరికి గౌరవం. అలాంటి చంద్ర మోహన్ ప్రస్తుతం ఇండస్ట్రీ పోకడల గురించి మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సినిమాలలో కొత్తవాళ్ళను ఎవరిని రానివ్వడం లేదని, ఎంతసేపు వారసులను తీసుకురావడంతోనే సరిపోతోందని ఆవేదన చెందారు. మంచి మంచి నటులు మనవద్దే ఉన్నప్పటికీ తెలుగు రాని పర బాషా నటులను తీసుకొచ్చి విలన్లుగా రుద్దుతున్నారు అన్న చంద్రమోహన్ ఇప్పుడొస్తున్న సినిమాల్లో కథా కథనాలు తీసికట్టుగా ఉంటున్నాయని తేల్చారు.

కెరీర్ మొత్తంలో 800 పైగా సినిమాల్లో నటించినా తనకు సంతృప్తి లేదని, సినిమాల్లోకి రావడం వల్ల పేరు వస్తుంది తప్ప ఇంత డబ్బు వ్యాపారంలో ఉన్నా సంపాదించుకోవచ్చని అన్నారు. పేరు రావడం వేరు, ఆ పేరుకు తగ్గట్టు ఆర్టిస్టులు ఆర్థికంగా బలంగా ఉంటారు అనుకోవడం వేరు అని విశిదీకరించే ప్రయత్నం చేసారు. ఈ మధ్య కాలంలో కొందరు పేరున్న నటీనటులు ఆరోగ్య ఖర్చులకు సైతం తగిన డబ్బు లేక సహాయం కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమ వైజాగ్ వెళ్తే వచ్చే ఉపయోగం ఏమి లేదని, హైదరాబాద్ లోనే అన్ని ఉన్నాయని స్పష్టం చేసారు.

రాజకీయాలు అంటే అసహ్యం అన్న చంద్ర మోహన్ తనకు మంచి స్నేహితులైన మురళి మోహన్, జయసుధ, మోహన్ బాబు, జయప్రద, జయలలిత వీళ్ళంతా అందులో ఉన్నా ఏ పార్టీకి మద్దతు ఇచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పారు. చంద్రమోహన్ గారి మాటల్లో నిజం లేకపోలేదు. ఇంత సీనియర్ నటులు ఇలా ఆవేదన చెందటం గతంలో కోట శ్రీనివాసరావు, సత్య నారాయణ లాంటి వాళ్ళు స్పందించినప్పుడు కూడా చూసాం. వీళ్ళ అనుభవాలను బట్టి సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్ని చిక్కు ముళ్ళు ఉన్నాయో అర్థమవుతోంది కదా
Tags:    

Similar News