తెలుగు సినిమాల్లో హాస్య వ్యవసాయం చేసింది జంధ్యాలనే

Update: 2021-11-30 09:33 GMT
తెలుగు తెరకి హాస్యం కొత్తకాదు. కస్తూరి శివరావు .. రేలంగి .. రమణా రెడ్డి .. రాజబాబు .. అల్లు రామలింగయ్య ఇలా ఎంతోమంది హాస్యరసాన్ని ఒలికించారు. అయితే అప్పట్లో హాస్యమనేది సినిమాలో అప్పుడప్పుడు మాత్రమే తళుక్కున మెరిసేది. హాస్యాన్నే నమ్ముకుని పూర్తిస్థాయి కథలను నడిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి ట్రెండ్ ను పూర్తిగా మార్చేసిన ఘనత జంధ్యాలకి దక్కుతుంది. చాలా తక్కువ బడ్జెట్లో నవ్వి నవ్వి అలసిపోయేంత ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించినవారాయన.

'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ జంధ్యాల గురించి ప్రస్తావించారు. తాను ఎలా జంధ్యాల గారి కంటపడింది చెప్పుకొచ్చారు. " రచయిత ఆదివిష్ణు గారు నాకు బాగా పరిచయం. నేను సెలవులకి హైదరాబాద్ వచ్చేవాడిని. అలా వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎక్కువగా ఉండేవాడిని. నాలో మంచి కమెడియన్ ఉన్నాడని ఆయన గ్రహించాడు. ఆయన ద్వారా నేను నటుడిగా దూరదర్శన్ లో కనిపించాను. అప్పుడు జంధ్యాలగారు నన్ను చూసి పిలిపించారు. నా టాలెంట్ ఏమిటనేది ఆయన గ్రహించారు.

ఇదిగో ఇవాళ మీ అందరినీ నవ్వించేటటువంటి శక్తి నా దగ్గర ఉందని మొట్టమొదట నన్ను గుర్తించిన వ్యక్తి జంధ్యాలగారు. అలా నేను ఆయనకి పరిచయమయ్యాను. ఆ తరువాత నా బ్రతుకు మీకు తెలిసిందే. ఏ భాషలో ఏ కమెడియన్ బాగా చేసినా .. ఏ కమెడియన్ కి ఎంత పేరు వచ్చినా, ఆ క్రెడిట్ డైరెక్టర్ కే వెళుతుంది. అలాగే నా విషయంలోను క్రెడిట్ అంతా కూడా జంధ్యాలవారికే వెళుతుంది. కామెడీ అంటే జంధ్యాలగారు .. జంధ్యాల గారు అంటే కామెడీ. పెన్ను ద్వారా నవ్వులతో ఆయన డాన్సులు వేయించారు .. సర్కస్ లు చేయించారు.

ఒక అలీ .. ఒక బ్రహ్మానందం .. సుత్తి వేలు .. సుత్తి వీరభ్రదరావు వంటి వాళ్లందరి చేత కామెడీ చేయించారు. చలనచిత్ర పరిశ్రమలో హాస్య వ్యవసాయం చేసినవారు జంధ్యాలగారు. ఆయన నా గురువు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే ఆయన కూడా నేను ఆయన శిష్యుడినని చెప్పుకోవడానికి బ్రతికున్నరోజుల్లో గర్వపడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన 'అహ నా పెళ్లంట' సినిమాను సత్తెనపల్లిలోని సినిమా థియేటర్లలో మా అమ్మానాన్నలకు చూపించాను. థియేటర్లో అందరూ నవ్వుతుంటే .. 'ఇంతమందిని ఎలా నవ్విస్తున్నవురా' అని మా నాన్న అన్నాడు" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News