ఆ మేలు మరిచిపోని బోయపాటి

Update: 2016-04-11 07:30 GMT
మనం ఎంత గొప్ప స్థాయికైనా ఎదగొచ్చు. కానీ ఆ స్థాయికి చేరడానికి తొలి అడుగు ఎలా పడిందో మాత్రం మరిచిపోకూడదు అంటున్నాడు బోయపాటి శ్రీను. తాను ఈ రోజు దర్శకుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు అల్లు అర్జునే కారణం అంటూ.. తన హీరో మీద ప్రశంసల జల్లు కురిపించాడు బోయపాటి. తన తొలి సినిమా ‘భద్ర’ కథను తాను ముందు వినిపించింది బన్నీకే అని.. ఐతే ఆ సినిమా అతను చేయకపోయినా.. తనకు డైరెక్టర్ గా ఛాన్స్ మాత్రం ఇప్పించాడని బోయపాటి చెప్పాడు.

‘‘గంగోత్రి సినిమా అయిపోయాక బన్నీకి నేనో కథ చెప్పాను. అదే భద్ర. ఐతే ఈ కథ చేయడానికి తన అనుభవం సరిపోదని.. ఈ టైంలోనే అంత మాస్ కథ చేస్తే ఇమేజ్ కు సూటవ్వదని చెప్పాడు. ఐతే ఇంత మంచి కథ చెప్పారు కాబట్టి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తానన్నాడు. అన్నట్లే నేరుగా దిల్ రాజు గారి దగ్గరికి తీసుకెళ్లి కథ చెప్పించాడు. అప్పటికప్పుడు అడ్వాన్స్ ఇప్పించాడు. కాబట్టి నేను నేను డైరెక్టర్ కావడానికి ప్రధాన కారణం అతనే. చేసిన మేలు ఏ రోజూ మరిచిపోకూడదు. అందుకే బన్నీ గురించి ఇలా చెబుతున్నా. ప్రతిభ దేవుడిస్తాడు.. వినయంగా ఉండాలి. కీర్తి మనుషులిస్తారు.. జాగ్రత్తగా ఉండు నిలబెట్టుకోవాలి.. ఈ రెండూ తెలిసి నడుచుకునేవాడే బన్నీ. నేను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాను.. బన్నీ కూడా అంతే. కృషి-కసి కలిస్తే బన్నీ’’ అన్నాడు బోయపాటి.

‘సరైనోడు’ సినిమా ఏదో కొత్తగా చేశాం.. ఇరగదీశాం అని తాను చెప్పనని.. ఐతే గుండె మీద చెయ్యేసుకుని ఈ సినిమా చూడండి అని మాత్రం ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలనని బోయపాటి అన్నాడు. న్యాయం నాలుగు కాళ్ల మీద నిలబడాలి.. అన్యాయానికి కాళ్లే ఉండకూడదు.. అని భావించే సొసైటీ మీద గ్రిప్ ఉన్న ఓ కుర్రాడి కథే ‘సరైనోడు’ అని బోయపాటి చెప్పాడు. తాను గుంటూరులో ఈనాడు విలేకరిగా పని చేశానని.. తర్వాత దర్శకుడిగా మారి రామోజీ రావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నానని.. అలాగే ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ‘గీతా ఆర్ట్స్’లో ఇప్పుడు దర్శకుడిగా పని చేయడం కూడా తనకు గర్వకారణం అని బోయపాటి అన్నాడు.
Tags:    

Similar News