బెంగళూరు మల్టీప్లెక్స్‌ లకు మన సినిమాలతో అన్‌ లాక్‌

Update: 2020-10-15 06:15 GMT
దేశ వ్యాప్తంగా ఏడు నెలల తర్వాత నేటి నుండి థియేటర్ల ఓపెన్‌ కు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కాని చాలా చోట్ల థియేటర్లు ఇంకా ఓపెన్‌ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుండి స్పష్టత రాకపోవడంతో పాటు కొన్ని డిమాండ్‌ లు ఉన్న కారణంగా థియేటర్లు ఇంకా లాక్‌ లోనే ఉన్నాయి. పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం థియేటర్ల ఓపెన్‌ కు సిద్దం అయ్యింది. నేటి నుండి అక్కడ బొమ్మ కూడా పడింది. గత మూడు నాలుగు రోజులుగానే బుక్‌ మై షో మరియు కొన్ని ఆన్‌ లైన్‌ పోర్టల్‌ లు టికెట్ల విక్రయం కొనసాగించాయి. ప్రధానంగా బెంగళూరులోని మల్టీప్లెక్స్‌ లు ఓపెన్‌ అయ్యాయి.

కొత్తగా సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్‌ కు ధైర్యం చాలడం లేదు. కన్నడంలో విడుదలకు కొన్ని పెద్ద సినిమాలు రెడీగా ఉన్నా కూడా నేడు పాత సినిమాలనే స్క్రీనింగ్‌ చేస్తున్నారు. తెలుగు సినిమాలు భీష్మ మరియు అల వైంకుఠపురంలో సినిమాలు అక్కడ ఎక్కువ షో లు వేస్తున్నారు. తెలుగు వర్షన్‌ లోనే బెంగళూరు మల్టీప్లెక్స్‌ లో విడుదల చేశారు. ఈ రెండు సినిమాలకు బుకింగ్స్‌ కూడా బాగా ఉన్నాయంటూ కన్నడ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా ఒకటి రెండు హిందీ సినిమాలు కూడా బెంగళూరు మల్టీప్లెక్స్‌ ల్లో కనిపిస్తున్నాయి. అయితే అల వైకుంఠపురం మరియు భీష్మ సినిమాలు సూపర్‌ హిట్‌ గా నిలిచాయి కనుక ఈ రెండు సినిమాలకు ఎక్కువ బుకింగ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాల వసూళ్లను బట్టి కన్నడ కొత్త సినిమాలు విడుదలకు రెడీ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మన వద్ద థియేటర్లు అన్‌ లాక్‌ కాకున్నా మన సినిమాలతో పక్క రాష్ట్రంలో థియేటర్లు అన్‌ లాక్‌ అయ్యాయి. మన వద్ద కూడా దసరా వరకు థియేటర్లు పునః ప్రారంభం అవుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు కూడా ఈ రెండు సినిమాలనే స్క్రీనింగ్‌ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News