బాలయ్య కోసం బిజీగా మారిన త‌మ‌న్.. NBK111తో మ‌రోసారి మ్యాజిక్

నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా NBK111పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.;

Update: 2026-04-13 10:02 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా NBK111పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ వర్క్ జోరుగా కొనసాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారు.

బాలకృష్ణ సినిమాలకు తమన్ అందించే సంగీతం ప్రత్యేక గుర్తింపును పొందింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. అదే మ్యాజిక్‌ను NBK111లో కూడా రిపీట్ చేయాలని తమన్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన రెండు పవర్‌ఫుల్ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వీటిలో ఒక సాంగ్‌కు అనంత శ్రీరామ్ మంచి ప‌వ‌ర్‌ఫుల్ సాహిత్యాన్ని అందించినట్లు సమాచారం.

ఈ సాంగ్ ను త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ సెటప్‌తో తెరకెక్కించనున్న ఈ సాంగ్ సినిమాలో కీలకమైన మాస్ ఎలిమెంట్‌గా నిలవనుందని టాక్. ఇదే లొకేషన్‌లో వెంటనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. బాలయ్యకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మూవీలో బాలకృష్ణ రాజుగా కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, పాత్రలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య మార్క్ మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు, ఎమోష‌న్స్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తుండటం సినిమాకు మరో ప్రధాన హైలైట్. గతంలో వీరిద్ద‌రి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. దీంతో మరోసారి ఈ జోడీ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్ర‌స్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో రూపొందించ‌డానికి మేక‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. మ్యూజిక్ నుంచి యాక్షన్ వరకు ప్రతి అంశంలోనూ గ్రాండ్‌నెస్ చూపించాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని- తమన్ కాంబోలో రానున్న NBK111 ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తూ, రిలీజ్ కు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంటోంది. మ‌రి ఫ్యాన్స్ అంచ‌నాల‌ను ఈ సినిమా ఏ మేర‌కు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News