ఓర్నీ.. బండబడ బండ్లా.. పవన్ కోసం అలా నరుక్కొస్తున్నవా?

Update: 2021-01-03 08:08 GMT
‘పవన్ కల్యాణ్ నా దేవుడు’ ఇదీ.. పవన్ గురించి బండ్ల గణేష్ ఎప్పుడు మాట్లాడినా చెప్పే మాట. తనను ప్రొడ్యూసర్ గా నిలబడటంలో సహకరించినందుకా? వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ.. పవన్ ను తెగ పొగిడేస్తుంటాడు బండ్ల. ‘పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్’ బ్యానర్ స్థాపించి ‘తీన్ మార్’ కొడదామనుకున్నప్పటికీ.. పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రెండో సినిమా కూడా పవన్ తోనే ‘గబ్బర్ సింగ్’ తీసి బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు బండ్ల ఊపు మామూలుగా లేదు. కానీ.. ఏమైందో ఏమో ఉన్నట్టుండి సినిమాలు నిర్మించడం మానేశాడు. ఈ మధ్య మళ్లీ సినిమాలు తీసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

అది కూడా మళ్లీ పవన్‌తోనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు బండ్ల గణేష్. కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. మరి, బండ్ల రీ-ఎంట్రీ మూవీ ఎవరితో చేస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. న్యూఇయర్ సందర్భంగా నలుగురు మెగా హీరోలను కలిశాడు బండ్ల. అందులో చిరంజీవి, పవన్ కూడా ఉన్నారు. అయితే.. వారిని మర్యాదపూర్వకంగా కూడా కలవొచ్చు. కానీ.. మిగిలిన మెగా హీరోలను వదిలి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లను బండ్ల కలిశాడు. ఇదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయ్యింది.

సాయి తేజు ఫొటో పెట్టి ‘నా హీరో’ అంటూ యాడ్ చేసిన బండ్ల.. వైష్ణవ్ ఫొటోకు ‘నా కొత్త హీరో’ అని క్యాప్షన్ జోడించాడు. ఈ కామెంట్ల వెనక అంతరార్థం ఏంటనేది కాస్త లోతుగా ఆలోచించినా అర్థమవుతుంది. వీరిద్దరితో సినిమా చేయబోతున్నానని ఇండైరెక్టుగా ప్రకటించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిలో ముందుగా వైష్ణవ్‌తో బండ్ల సినిమా ఉండొచ్చని అంటున్నారు.

పవన్ తన ఫ్యామిలీ హీరోల గురించి బహిరంగంగా డబ్బాకొట్టడం.. ప్రమోట్ చేయడం వంటివి చేయడు. కానీ.. వారి కెరీర్లను నిలబెట్టడం కోసం తన పరిచయాలను ఉపయోగిస్తుంటాడని చెబుతుంటారు. సాయి తేజు కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నపుడు పవన్ బాగా సపోర్ట్ చేశాడని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు.. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవ్‌కు కూడా పవన్ సపోర్ట్ ఉంటుందని, అతడితో సినిమా చేయడం ద్వారా పవన్‌ను మెప్పించి, ఆ తర్వాత పవన్ తో మరో చిత్రం చేయడానికి ఓకే చెప్పించుకోవాలన్నది బండ్ల ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. ఈ ప్లాన్ చూస్తే.. ఓర్నీ బండబడ బండ్లా అని నోరెళ్లబెట్టాల్సిందే కదా!


Tags:    

Similar News